విజయవాడ, జనవరి 18,
ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు.. ఇప్పుడు చాలా మంది నేతల చూపు.. బీజేపీ వైపు పడింది. ఒక్క అధికార పార్టీ వైసీపీ నేతలను పక్కన పెడితే.. మిగిలిన జనసేన, టీడీపీ పార్టీల నుంచి నేతలు.. చాలా మంది ఇప్పుడు బీజేపీలో చేరేందుకు పావులు కదు పుతున్నారు. ఇది అనూహ్య పరిణామంగా మారడం గమనార్హం. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పుంజుకునేలా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుండడం, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం వంటి పరిణామాలపై భారీ ఎత్తున కసరత్తు చేస్తుండడం.. దీనికి తగిన విధంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు సహా పలువురు నాయకులు దూకుడుగా వ్యవహరిస్తుండడం వంటివి బీజేపీపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.ఈ క్రమంలో వైసీపీ నుంచి గతంలో జంప్ చేసి టీడీపీలో చేరిన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, గుంటూరు నుంచి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనంతపురం నుంచి జేసీ బ్రదర్స్, కర్నూలు నుంచి టీజీ కుమారుడు భరత్ వంటి నేతలతో ఇప్పుడు బీజేపీ నేతలు టచ్‌లోకి వెళుతున్నారు. ఇప్పుడు మీరున్న పార్టీలో భవిష్యత్ ఉండదని వీరిపై తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారట. ప్రస్తుతం కర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న టీజీ భరత్ తండ్రి వెంకటేష్ బీజేపీలోనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండడం, పార్టీలో యువ నేతగా ఉన్నా.. తగిన గుర్తింపు లేక పోవడం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో.. ఇప్పుడు బీజేపీవైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పైగా తండ్రి ఒక పార్టీలో కొడుకు ఒకపార్టీలో ఉండడాన్ని ఇటీవల సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇది కూడా భరత్ పార్టీ మారితే మారవచ్చనేందుకు ఓ కారణంగా కనిపిస్తోంది.మరోవైపు గిరిజన నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో ఉండి.. ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారికి ఇప్పుడు బీజేపీ మంచి ఆఫర్ ప్రకటిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో గిరిజన నాయకుల కొరత చాలా ఉంది. పైగా ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన గిడ్డి ఈశ్వరి వంటివారు బీజేపీలోకి వస్తే పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటివారు పార్టీ మారుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరో వైపు గుంటూరు జిల్లా నరసారావు పేట మాజీ ఎంపీ.. రాయపాటికి రాజ్యసభ సీటు హామీ లభిస్తే.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తోంది.ఇప్పుడు దీనిపై హామీ ఇవ్వకపోయినా.. కేంద్రంలో మంచి పొజిషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామనే సంకేతాలు పంపారు. ఈ క్రమంలో రాయపాటి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. అయితే.. ఆయన కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీలోనే ఉంటారా? బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా ? చూడాలి. రాయపాటి జంప్ వెనుక మరో రీజన్ కూడా బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో ఇటీవల ఆయన చుట్టూ ఉచ్చుబిగిసింది. ఈ క్రమంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటే కొంత ఉపశమనం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు.ఇక, ఇదే విషయంలో సోము వీర్రాజు వ్యూహం మరోలా ఉంది. రాయపాటిని పార్టీలో చేర్చుకుంటే.. కన్నా లక్ష్మీనారాయణ దూకుడుకు అడ్డుకట్ట వేయడం ద్వారా.. తన హవాకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇలా చాలా మంది నాయకులు పార్టీ మారి.. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం బీజేపీలో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.