తన తల్లిని శ్రీ రెడ్డి దుర్భాషలాడటం, మీడియాలో పదే పదే ఆ దృశ్యాలను ప్రసారం చేయడంపై తీవ్రంగా కలత చెందిన పవన్ కల్యాణ్ గురువారం రాత్రి నుంచి వరుసబెట్టి ట్వీట్లు చేశారు. మీడియా అధిపతులను లక్ష్యంగా చేసుకున్నారు. తన తల్లిని తిట్టించడంలో టీడీపీకి సహకరించారంటూ.. కొందరు మీడియా ప్రముఖుల పేర్లను ఆయన బయటపెట్టారు. టీవీ9, టీవీ5, ఏబీన్ ఛానెళ్లను బాయ్‌కాట్ చేయాలంటూ.. అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పవన్ చేసిన ఈ ట్వీట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండాపవన్ తమపై విమర్శలు చేయడంతో.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 9 శ్రీని రాజు ఆయనపై పరువు నష్టం దావా వేస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వెనక్కి తగ్గకపోగా.. తన విమర్శల తీవ్రతను మరింత పెంచారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్ల దాడి మొదలు పెట్టిన జనసేనాని.. తర్వాత ఓ సీఎంపై విమర్శలు ఎక్కుబెట్టారు. ఈ ‘అజ్ఞాతవాసి’ని వాడో బ్లాక్ మెయిలర్ అని ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్ ర్యాంక్ మంత్రితో అన్నారు. ఈ విషయాన్ని మంత్రి ‘ఒకరి’తో చెప్పారని పవన్ ట్వీట్ చేశారు. ఆ సీఎం ఎవరో మనం అర్థం చేసుకోగలం. కానీ ఆ మంత్రి ఎవరు? ఆ ఒకరెవరు? అనే అంశం ఆసక్తి రేపుతోంది.