విజయవాడ, జనవరి 18,
అదేంటో ఏపీలో చిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. ఇంటి లోపల సమస్యలతో జగన్ ఉంటే బయట మాత్రం పల్లకీ మోత ఘనంగానే ఉంది. ఏపీ సీఎం ది బెస్ట్ సీఎం అంటూ ఒక్కటే ఊదరగొడుతున్నాయి జాతీయ సర్వేలు. ఇలా ఒకసారి కాదు. అనేకసార్లు జగన్ ఉత్తమ ముఖ్యమంత్రి అంటూ గట్టిగానే బాకా ఊదుతున్నాయి. మరి ఏపీలో రాజకీయం చూస్తే జగన్ కంటే ఫెయిల్యూర్ సీఎం ఎవరూ లేరని విపక్షాలు రంకెలు వేస్తున్నాయి. ఇందులో ఏది నిజం అన్నదే ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది మరి.నిజానికి ఎవరైనా జాతీయ సర్వేలనే ఇపుడు నమ్మాలి. ఎందుకంటే వాటికి ఏపీ రాజకీయాల రంగు రుచి పెద్దగా అంటదు కాబట్టి. ఏపీలో మీడియా రాజకీయం మితిమీరిపోయింది. దాంతో పాటు మెజారిటీ మీడియా ఏపీ సర్కార్ కి వ్యతిరేకంగా ఉంది. ఈ పరిణామాలతో ఏపీ నుంచి చూస్తే కనుక జగన్ సర్కార్ గురించి జనాలు మరోలా అనుకునేలా సీన్ కనిపిస్తోంది. వాస్తవానికి జగన్ ఎన్నో మంచి పనులు చేశారు, చేస్తున్నారు. వాటి మీద ప్రచారం జరగకముందే విగ్రహాల విద్వంసం అంటున్నారు. మరోటి అంటున్నారు. దాంతో వచ్చేది మా సర్కారే అంటూ టీడీపీ వంటి బలమైన పార్టీలు బస్తీ మే సవాల్ చేస్తున్నాయి. మరి జాతీయ మీడియా ఈ మబ్బు తెరలు దాటి ముందుకు చూసిందనుకోవాలి.జగన్ జాతీయ స్థాయిలో టాప్ త్రీగా ఉండడం ఇంతకు ముందు కూడా జరిగింది. అదే సమయంలో జగన్ కంటే సీనియర్ ముఖ్యమంత్రులు ఎందరో ఉన్నా కూడా వారు వెనకబడిపోతున్నారు. మరి జగన్ కి ఈ ర్యాంక్ రావడానికి కారణం ఏంటి అంటే ఆయన సంక్షేమ పధకాలు అని చెప్పుకోవాలి. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయనకు ఎన్నికల వేళ కలసి రావని తమదే విజయమని జబ్బలు చరుస్తున్నా విపక్షాలకు ఈ సర్వే షాక్ ఇచ్చిందనే అనుకోవాలి. ఇక జనాల్లో జగన్ పట్ల పూర్తి సానుకూలత లేకపోతే ఈ సర్వే ఫలితాలు ఇలా రావు కదా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి చూస్తే జగన్ పాలనకు ఈ సర్వేలు గీటు రాయిగానే చూడాలి అంటున్నారు.ఇక ఈ సర్వే ఫలితాలను బేరీజు వేసుకుంటే ఏపీలో జగన్ని కార్నర్ చేయడానికి విపక్షాలు ఎంచుకున్న అజెండా కానీ, వారు జనాల్లో పెట్టి పోరాడుతున్న అంశాలు కానీ పెద్దగా ప్రభావం చూపించడం లేదని కూడా అర్ధమవుతోంది. జగన్ నమ్ముకున్న సంక్షేమ మంత్రం ఆయన్ని ఒడ్డున పడేస్తుంది అన్నదే ఈ సర్వేల సారాంశంగా ఉంది. మరి అది ఎంతవరకూ నిజమన్నది ఈ ఏడాదిలో జరిగే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో పాటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా రుజువు చేస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో తానే నంబర్ వన్ సీఎం అని గతంలో చంద్రబాబు పదే పదే చెప్పుకునేవారు. ఇపుడు రెండేళ్ళు తిరగకుండానే జగన్ ఎన్నో ర్యాంకులు సాధించడం అంటే సహజంగానే టీడీపీ ఇబ్బంది పడడం ఖాయం. కానీ ఇప్పటికైనా జగన్ పాలన ఉత్తమంగా ఉందని మనసులోనైనా టీడీపీ లాంటి విపక్షాలు ఒప్పుకుని దానికి ధీటుగా తమ వ్యూహాలు మార్చుకుంటాయా. లేక ప్రజాభిప్రాయం తమకే అనుకూలమని అతి విశ్వాసంతో ఆలాగే ఉంటాయా అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ దూకుడు ఎక్కడా ఆగలేదన్నదే సర్వేల సారాంశం