విజయవాడ, జనవరి 18,
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మే నెలలోనే లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో స్పెషల్ ఆఫీసర్ల పాలనను జూన్ నెల వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మే నెల తర్వాతనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది.మార్చి నెలలో ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల కమిషనర్ నియమితులవుతారు. ఆయన ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మూడురోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కలసి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.కానీ హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో స్పెషల్ ఆఫీసర్ల పాలనను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈలోపు తిరుపతి ఉప ఎన్నిక కూడా పూర్తవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉంది. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పెడితే పార్టీకి సానుకూలత లభిస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.ఈలోపు జగన్ తలపెట్టిన సంక్షేమ పథకాలన్నీ గ్రౌండ్ అవుతాయి. ఇప్పటికే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పూర్తి కావచ్చింది. అమ్మవొడి రెండో విడత నిధులను కూడా లబ్దిదారుల ఖాతాలో పడ్డాయి. మరికొన్ని పథకాలను కూడా ప్రజలకు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో పాటు రోడ్ల మరమ్మత్తులకు కూడా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ పనులు కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తుంది. మరి న్యాయస్థానం తీర్పులు ఎలా ఉండనున్నాయో చూడాలి.