విజయవాడ, జనవరి 18,
ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలలో చూసుకుంటే టీడీపీకే సినీ గ్లామర్ ఎక్కువ. అది మహా నటుడు ఎన్టీయార్ పెట్టిన పార్టీ. ఇక ప్రస్తుత తరం నటుడు జూనియర్ ఎన్టీయార్ ప్రస్తావన కూడా పదే పదే ఆ పార్టీలో జరుగుతూ ఉంటుంది. మరో వైపు నట సింహం బాలక్రిష్ణ కూడా టీడీపీలోనే ఉన్నారు. ఒక బలమైన సామాజికవర్గం ఆధిపత్యం సినీ సీమలో ఉంది. ఆ వర్గం వారంతా టీడీపీని తన సొంత పార్టీగా చెప్పుకుంటారు. ఇక దాంతో పోలిస్తే వైసీపీకి చాలా తక్కువ మద్దతు దక్కుతోంది.వైసీపీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు రాగానే తామరతంపరగా సినీ జనం వెళ్ళి జగన్ చేత కండువాలు కప్పించుకున్నారు. అలా చేరిన వారిలో నటీనటులు జీవిత, రాజశేఖర్, జయసుధ, ఆమె కుమారుడు, వినాయకుడు ఫేం క్రిష్ణుడు, సినీ నటుడు మోహన్ బాబు వంటి వారు కనిపిస్తారు. ఇక ఆలీ కూడా ఎన్నికల ముందే వైసీపీలో చేరారు. పోసాని క్రిష్ణ మురళి అయితే బాహాటంగా జగన్ కి మద్దతు ఇచ్చారు. డైరెక్టర్ క్రిష్ణా రెడ్డి అచ్చిరెడ్డి వంటి వారు జగన్ తో కలసి పాదయాత్రలో అడుగులు వేసి వైసీపీకి మద్దతు ఇచ్చారు. మరో వైపు థర్టీ యియర్స్ ఇండస్ట్రీ పృధ్వీ వంటి వారు జగన్ మీద ఈగవాలనీయకుండా చూసుకున్నారు. అయితే ఇపుడు వారిలో ఎవరూ జగన్ పార్టీలో కనిపించడంలేదు. వీరంతా జగన్ గురించి కూడా అనుకూలంగా మాట్లాడడంలేదువీరిలో పృద్వీ అయితే టీటీడీ వారి వెంకటేశ్వర చానల్ చైర్మన్ పదవిని పొందారు. ఆ తరువాత వచ్చిన ఆరోపణల నేపధ్యంలో తన స్వీయ తప్పిదాల కారణంగా పదవిని కోల్పోయారు. ఆ మీదట నుంచి పృద్వీ వైసీపీకి దూరం జరిగారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పొగుడుతున్నారు. ఇక పోసాని అయితే జగన్ పాలనా విధానాలతో కొంత విభేదిస్తున్నారు. మోహన్ బాబు దూరం జరిగారు. జీవితా రాజశేఖర్ తాజాగా బీజేపీలో చేరిపోయారు. జయసుధ లాంటి వారు ఫుల్ సైలెంట్ అయ్యారు. దాంతో సినీ గ్లామర్ ఏ మాత్రం ఇపుడు వైసీపీలో కనిపించడంలేదు.విశాఖలో సినిమా వారికి స్టూడియోలు నిర్మించుకోవడానికి భూములు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినా కూడా టాలీవుడ్ పెద్దలు ఎవరూ ఏపీ వైపు తొంగి చూడడంలేదు. దానికి కారణం వారికి టీడీపీ జనసేనలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండడం. మరో వైపు తెలంగాణాలో కేసీయార్ ని అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. నాగార్జున వంటి వారు జగన్ కి సన్నిహితులు అని గతంలో అనేవారు. ఇపుడు ఆయన కూడా కేసీయార్ సర్కార్ తోనే ఎక్కువగా దోస్తీ చేస్తున్నారు. ఇక విశాఖలో స్టూడియోలు కడతామని గతంలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ వంటి వారు ప్రకటించారు. ఇపుడు వారు హైదరాబాద్ లోనే స్టూడియోలు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఏపీలో తీసుకుంటున్న దూకుడు నిర్ణయలు ఒక బలమైన సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అన్న ప్రచారం మూలంగా కూడా టాలీవుడ్ దిగ్గజాలు వైసీపీకి దూరం పాటిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. అలాగే జగన్ నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడం వల్ల కూడా ఎన్నికల ముందు చేరిన వారిలో అంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అంటున్నారు. ఇక బీజేపీలో తారల తళుకులు కనిపిస్తున్నాయి. అలనాటి నటి వాణీ విశ్వనాధ్ వంటి వారు ఆ పార్టీలో చేరడం చూస్తే ఏపీలో వైసీపీకి సినిమా తళుకు బెళుకులు ఇకపైన కష్టమే అన్న మాట వినిపిస్తోంది.