YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యడ్డీకి కలిసొస్తున్న కాలం

యడ్డీకి కలిసొస్తున్న కాలం

బెంగళూర్, జనవరి 18, 
యడ్యూరప్ప దిగివచ్చినట్లే కన్పిస్తుంది. తనపై గరం గరంగా ఉన్న ఎమ్మెల్యేలను శాంతపర్చే ప్రయత్నం చేశారు. నియోజకవర్గానికి అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. దీంతో ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే యడ్యూరప్ప ఈ ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయ్యారనే చెప్పాలి. యడ్యూరప్ప పై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను పదవి నుంచి దింపేయాలని గత కొంతకాలంగా కొందరు డిమాండ్ చేస్తున్నారు.నియోజకవర్గానికి నిధులు నిలిపేయడంతో తాము ప్రజలకు మొహం చూపలేకపోతున్నామని వారు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేవలం యడ్యూరప్ప ప్రాపకం పొందిన కొంతమంది ఎమ్మెల్యేలకే నియోజకవర్గ నిధులను విడుదల చేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ సయితం దీనిపై యడ్యూరప్పతో గతంలో చర్చలు జరిపారు. కానీ ఫలితం లేదు. అధిష్టానం జోక్యంతోనే పార్టీ ఇన్ ఛార్జి అరుణ్ సింగ్ ఎమ్మెల్యేలతో సఖ్యతగా మెలగాలని యడ్యూరప్పకు సూచించారు. యడ్యూరప్ప ఇటీవల 118 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్నారు. అందరిదీ ఒకటే మాట. తమ నియోజకవర్గాలకు నిధులు నిలిపేశారని. దీంతో యడ్యూరప్ప ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకూ నిధుల కేటాయించకపోవడానికి కారణాలను కూడా యడ్యూరప్ప వివరించారు. కరోనా, వరదల కారణంగానే తాను ఇప్పటి వరకూ నిధులు విడుదల చేయలేకపోయానని వివరించారు.అలా యడ్యూరప్ప ఎమ్మెల్యేలను శాంతపర్చే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేలను బుజ్జగించినంత మాత్రాన అధిష్టానం యడ్యూరప్ప ను ముఖ్యమంత్రిగా పూర్తికాలం కొనసాగిస్తుందా? లేదా? అన్నది మాత్రం సందేహంగానే ఉంది. మరో రెండున్నరేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. కానీ అంతకాలం మాత్రం అధినాయకత్వం అంగీకరించే పరిస్థితి లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మరి అప్ప భవిష్యత్ ఎలా ఉండనుందో? కాలమే తేల్చాలి.

Related Posts