అడవి జిల్లాలో జరుగుతున్న ఆపరేషన్ టైగర్ ఆగిపోయింది. కుమ్రంభీం జిల్లా కందిభీమన్న అడవుల్లో ఆరు రోజులుగా సాగుతున్న వేటకు బ్రేక్ పడింది. పులి దిశ మార్చుకోవడంతో మత్తమందు ప్రయోగాన్ని నిలిపేశారు. మళ్లీ ఆపరేషన్ ఎప్పుడు మొదలుపెడతారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.కుమ్రంభీం జిల్లా కంది భీమన్న అటవీ ప్రాంతంలో గత ఆరు రోజులుగా టైగర్ కోసం ఆపరేషన్ నిర్వహించారు. మత్తు మందు ప్రయోగం చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే .. ర్యాపిడ్ రెస్క్యూ టీంకు చిక్కినట్టే చిక్కి మ్యాన్ ఈటర్ తప్పించుకుంది.పులిని పట్టుకు నేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమించాయి. 40 మంది స్పెషల్ యాక్షన్ టీమ్ ఈ ఆపరేషన్ చేపట్టాయి. టైగర్ కదలికలు గుర్తించేందుకు నాలుగు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆవులను ఎరగా వేశారు. మంచెలపై షార్ప్ షూటర్స్‌ను నియమించారు.పులి కోసం ఆరు రోజులుగా జల్లెడ పట్టినా ఫలితం కనిపించలేదు. అది ముప్ప తిప్పలు పెట్టింది. అధికారుల్ని ఆగమాగం చేసింది. ఇటీవల ఎరగా వేసిన ఆవును హతమార్చిన పులి.. మరో పశువును మాత్రం ముట్టలేదు. ఆపరేషన్ టైగర్‌ను మ్యాన్ ఈటర్ పసిగట్టినట్లు భావిస్తున్నారు. డ్రోన్ల సాయంతో కందిభీమన్న అటవీ ప్రాంతాన్ని అణువణువూ గాలించినా పులి మాత్రం దొరకలేదు. రెస్క్యూ టీం అలజడి తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రిజల్ట్ కనిపించలేదు.దీంతో ఆపరేషన్ టైగర్‌ను ఆపేశారు. మహారాష్ట్ర, తెలంగాణ రాపిడ్ రెస్క్యూ టీమ్స్ వెనుదిరిగిపోయాయి. అయితే మ్యాన్ ఈటర్ కోసం అడవుల్లో టైగర్ ట్రాకింగ్ మాత్రం కొనసాగుతోంది. మళ్లీ ఆపరేషన్ ఎప్పుడు మొదలుపెడతారన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.చట్టాలు కూడా పులికి అనుకూలంగా ఉన్నాయి. వన్యప్రాణి నిబంధనల ప్రకారం.. ఉదయం ఆరు లోపు... సాయంత్రం ఆరు తర్వాత మత్తు మందు ఇవ్వడానికి వీల్లేదు. ఇదే పులికి వరంలా మారిందని చెబుతున్నారు.