ఎలాంటి సుగుణాలు ఉంటే మనిషి ప్రయాణం..మహా ప్రయాణంగా మారుతుందో ఆచరణలో పెట్టి చూపించాడు రాముడు. ఆయన దేవుడా? మనిషా? అని పక్కకు పెడితే.. తల్లిదండ్రులను గౌరవించడంలో, భార్యను ప్రేమించడంలో, తమ్ముళ్లను అభిమానించడంలో, స్నేహితులను సమానంగా చూడటంలో, ప్రజారక్షణకు ధర్మాన్ని అనుసరించడంలో రాముడు నేటికీ ప్రతి ఒక్కరికీ ఆదర్శం . రాముడు తానే ముందుగా రా పలకరించి మాట్లాడేవాడు. పెద్దవాళ్లను పలకరించేవాడు. వాళ్ల నుంచి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించేవాడు. ధనం సంపాదించే ఉపాయాలు తెలిసినవాడు..సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. కాబట్టే రాముడిని రాజుగా చేయాలంటున్నాను. అంతేగానీ, తనకు ఎదురు చెప్పలేకపోవటం వల్ల రాముడు ప్రభువుగా ఉండాలని అనడం లేదని దశరధుడు సామంతరాజుల సభలో...తన ప్రతిపాదనను చెప్తాడు. రాముడు యుద్ధాలకు వెళ్లి తిరిగివచ్చేటప్పుడు రథం మీద ఉన్నా, ఏనుగు మీద ఉన్నా... గాని ప్రజల దగ్గరకు వెళ్లి కుశల ప్రశ్నలు అడిగి సమస్యల్ని తెలుసుకునేవాడు. పట్టాభిషేకం.. రామ పట్టాభిషేక ఉత్సవాన్ని చూడటానికి దశరధుడు పిలిపించిన రాజులలో పడమటి దేశాలవాళ్లు, ఉత్తర, దక్షిణ దేశాలవాళ్లు, సమస్త ఆర్యావర్తం ఉన్నారు. రాముడి రాకను దశరథుడు ఎత్తైన మేడ నుంచి చూస్తున్నాడు. ఆమేడను రాముడు ఎక్కాడు. తండ్రికి తన పేరు చెప్పి పాదాభివందనం చేశాడు. తండ్రిని గౌరవించడంలో రాముడు ఎప్పుడూ ఆదర్శప్రాయుడే. పట్టాభిషేక విషయంలో మొహమాటపడుతున్న రాముడిని చూసి "నా మనసులో మరొక ఆలోచన కలగడానికి ముందే అభిషేకం చేయించుకో. మానవుల మనసు చంచలమైంది కదా! "అంటాడు దశరథుడు. “రాత్రి అంతా ఉపవాసం చేయి. రేపే పట్టాభిషేకం, అడ్డంకులు కలగకుండా నీ స్నేహితులందరూ నిన్ను రక్షించాలి. భరతుడు నగరానికి దూరంగా ఉండగానే అభిషేకం జరగాలి. భరతుడు ధర్మస్వరూపుడే. కానీ, ధర్మనిరతులు, సన్మార్గంలో నడిచేవాళ్లయినా మనుషుల మనసు చంచలం కావచ్చునని నా అభిప్రాయం" అంటాడు. ఇక్కడ రాముడి మనసు అచంచలమైనదనే విషయం దశరథుడికి బాగా తెలుసు. రాముడు తల్లిదండ్రుల మాటనెప్పుడూ జవదాటలేదు. తల్లి కైకేయిమాట మీద రాముడు రాజ్యాన్ని విడిచి వెళ్లాలని అడవులకు వెళ్తాడు. రాజభోగాలన్నీ విడిచి.. అడవిలో సామాన్యుడిలా బతుకుతాడు. అన్నగా.. అండగా లక్ష్మణ, భరత, శతృఘ్నులు ముగ్గురినీ సమానంగా ఆదరించిన అన్న రాముడు. నీతతో కలిసి అరణ్యవాసం చేస్తున్నప్పుడు లక్ష్మణుడు కూడా తోడుండేవాడు. రాజ్యానికి తిరిగిరావాలని, పాలనాధికారం చేపట్టాలని కోరేందుకు భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవికి వస్తాడు. అయితే భరతుడిని చూసిన లక్ష్మణుడు చెడుగా ఆలోచిస్తాడు. రాముడిని అరణ్యవాసానికి పంపించిన కైకేయి, భరతుడికి తల్లి కావడమే ఆ కోపానికి కారణం. కానీ, రాముడికి భరతుడి గురించి బాగా తెలుసు. అతడ్ని ఆలింగనం చేసుకొని ఓదారుస్తాడు. అరణ్యవాసం పూర్తయిన తర్వాతే రాజ్యానికి వస్తానని తమ్ముడికి నచ్చజెప్తాడు. "రావణుడి మరణంతో వైరం తీరిపోయింది. అతడు నీకేమవుతాదో నాకూ అదే అవుతాడు” అని రావణుడి మృతదేహం చూస్తూ విభీషణుడితో అంటాడు రాముడు. ఆయన సోదరభావం అలాంటిది. స్నేహానికి అర్థం... రాముడి స్నేహం చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కిష్కింధకాండ చదవాలి. అన్న వాలిని చంపి... తన స్నేహితుడైన సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. రాముడు. రాజభోగాల మత్తులో పడి.. సుగ్రీవుడు రాముడుకి ఇచ్చిన మాటను మర్చిపోతాడు. రాముడు ఇంకా ఎదురు చూస్తుంటాడు. అప్పుడు తార, లక్ష్మణుడి దగ్గరకు వచ్చి సుగ్రీవుడు చేసిన ఆలస్యాన్ని క్షమించమని అడిగి. “ధర్మం, తపస్సులతో పేరు పొందిన మహర్షులు కూడా కామవశులయి నిరంతరం మోహంతో ఉంటారు. ఇక సహజంగా వానరుడై, చపలస్వభావం గలిగిన సుగ్రీవుడు కామాసక్తుడు కాకుండా ఎలా ఉండగలడు?" అంటుంది. ఎన్ని మాటలు చెప్పినా లక్ష్మణుడికి కోపంగానే ఉంటుంది. కానీ, ఆ రాముడు మాత్రం ప్రశాంతంగా తన స్నేహితుడి కోసం నమ్మకంతో ఎదురు చూస్తుంటాడు. లంకలో రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు న్యాయమైన ఆలోచనతో విభీషణుడు, రాముడికి అండగా నిలుస్తాడు. రావణ సంహారం తర్వాత లంకా రాజ్యాన్ని విభీషణుడికే అప్పగించి తన గొప్పదనాన్ని చాటుకుంటాడు రాముడు. విశపత్నీవ్రతుడు అరణ్యవాసానికి సిద్ధమవుతూ భార్య సీతను.. తన వెంట రావొద్దని, రాజ్యంలోనే ఉండిపొమ్మని వేడుకుంటాడు. తాను అనుభవించబోయే కష్టాల్లో.... తన భార్య పాలుపంచుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయం. వనవాసం వద్దన్నందుకు సీతకు రాముడిపై కోపం వస్తుంది. వెంటనే రామా, నీవు పురుష శరీరంగల స్త్రీవి.నా తండ్రి నిన్ను ఏమనుకుని అల్లుడిగా చేసుకున్నాదో తెలియదు! నీవు ఏ దశరథాదుల హితం మాట్లాడుతున్నావో వాళ్లకి నువ్వు విధేయునిగా ఉండవచ్చు. కానీ, నన్ను వాళ్లకి విధేయురాలుగా ఉండమనటం మాత్రం సరికాదు" అంటుంది (వాల్మీకి రామాయణం శ్లోకం.9) రాముడు ఇంకేం అనడు. ఇద్దరు కలిసి వనవాసానికి వెళ్తారు. చివరి శ్వాస వరకు రాముడు సీతను ప్రేమించి.. ఏకపత్నీవ్రతుడిగా లోకానికి ఆదర్శమయ్యాడు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో