తిరుపతి, జనవరి 19,
తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాదరావు హఠాన్మరణం చెందడంతో.. ఆ స్థానానికి త్వరలోనే ఎన్నిక రానుంది. ఇక, ఇప్పటికే టీడీపీ, బీజేపీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గెలుస్తాయా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. అధికార పార్టీవైసీపీ దూకుడుకు కళ్లెం వేయాలని మాత్రం నిర్ణయించుకున్నా యి. ఈ క్రమంలోనే అందిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నాయి. ఇక, వైసీపీ అదికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో జరగబోయే తొలి ఎన్నిక ఇదే. దీంతో అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. గత ఎన్నికల్లో 2 లక్షల పైచిలుకు మెజారిటీతో బల్లి దుర్గా ప్రసాదరావు విజయం దక్కించుకున్నారు. కానీ, ఇప్పుడు అంత మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అప్పటి దుర్గాప్రసాదరావుకు లభించిన ఓట్లను చూస్తే.. ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో ఈ మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి మాత్రమే చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.మిగిలిన నాలుగు నియోజకవర్గాలు.. వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఒకింత ఆశాజనకంగానే ఉన్నా.. నెల్లూరులో మాత్రం అంతర్గత కలహాలతో వైసీపీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో అక్కడి ఎమ్మెల్యేలు.. ఎంపీ విజయానికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ అభ్యర్థి సాధించిన ఓట్లు కూడా ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉన్నాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి 708 ఓట్ల మెజారిటీ వస్తే.. ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 3 వేల 578 ఓట్ల మెజారిటీ సాధించారు.సత్యవేడులో వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి 44 వేలకుపైగా మెజారిటీ వస్తే.. వైసీపీ ఎంపీకి 42 వేల ఆధిక్యతే వచ్చింది. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి 38వేల ఓట్ల మెజారిటీ వస్తే.. ఎంపీకి 32వేల ఓట్ల ఆధిక్యత లభించింది. నెల్లూరు జిల్లా గూడూరులో వరప్రసాద్‌కు 45వేల ఓట్ల మెజారిటీ వస్తే.. ఎంపీకి 46 ఓట్ల ఆధిక్యత వచ్చింది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి 14వేల మెజారిటీ వస్తే.. ఎంపీకి 15వేల ఆధిక్యత వచ్చింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు 78వేల ఓట్ల మెజారిటీ వస్తే… ఎంపీకి 57వేల ఆధిక్యమే లభించింది. వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి 88 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. ఎంపీకి కేవలం 36 వేల ఓట్ల ఆధిక్యత లభించింది.ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి ఫుల్లు అసంతృప్తితో ఉన్నారు. సో.. ఆయన ఎంపీ అభ్యర్థి కోసం ప్రయత్నించే అవకాశం తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ వైసీపీకి ఓట్లు మరింత తగ్గుతాయని అంటున్నారు. ఆయన ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదని డిసైడ్ అయిన పార్టీని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. వెంకటగిరిలో ఈ సారి వైసీపీకి దెబ్బ పడే ఛాన్సులే ఉన్నాయి. గూడూరులో గత ఎన్నికల్లో ఎంపీకి 46 వేల ఓట్లు వచ్చినా.. ఇప్పుడు ఇది తగ్గుతుందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత వచ్చింది. కొన్ని ప్రధాన వర్గాలు ఈ సారి పార్టీకి పనిచేయడమే మానేశాయి. సో..ఇక్కడ కూడా ఎంపీ అభ్యర్థికి ఓట్లు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.మరోవైపు శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబం పుంజుకుంది. దీంతో ఇక్కడ కూడా వైసీపీ ఎంపీ అభ్యర్థికి మెజారిటీ తగ్గుతుందని అంటున్నారు. ఇలా.. నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు. దీనిని బట్టి వైసీపీకి ఇక్కడ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత ఈజీకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ గెలిచినా.. గత మెజారిటీ రాదని చెబుతున్నారు. ఏదేమైనా వైసీపీ ఈ సారి లక్ష మెజార్టీతో ఈ సీటు గెలిస్తే గ్రేట్ అనుకోవాల్సిన పరిస్థితే అక్కడ ఉంది.