ఏలూరు, జనవరి 19,
దక్షిణ భారత దేశంలో జెండా పాతాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఆఖరుకు బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన మోడీ నాయకత్వంలో కూడా సౌత్ ఇండియా బీజేపీ వశం కావడంలేదు. ఒక్క కర్నాటకలో తప్ప ఎక్కడా కచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయని నేటికీ చెప్పలేని స్థితి. ఈ నేపధ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ని దువ్వి ఎన్నికల పబ్బం గడుపుకోవాలని బీజేపీ చేసిన యత్నాలు కూడా బెడిసికొట్టాయి. రజనీ పూర్తిగా అస్త్ర సన్యాసం చేసి కూర్చున్నారు.ఇక రజనీ వయసు మీరిపోయాడు. ఆయనతో రాజకీయం కుదిరే పని కాదు, దాంతో బీజేపీ సరికొత్త ఎత్తుగడను వేస్తోందిట. ఏపీకి చెందిన యంగ్ రెబెల్ స్టార్ బాహుబలి అయిన ప్రభాస్ రాజు ను దువ్వేందుకు బీజేపీ హై కమాండ్ రెడీ అయిందని చెబుతున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు బీజేపీలో ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయన రెండు సార్లు పార్లమెంట్ మెట్లు ఎక్కింది కూడా కమలం పార్టీ తరఫునే. ఇక వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణం రాజు ఇపుడు బీజేపీకి చటుక్కున్న గుర్తుకు రావడం వెనక బాహుబలి ప్రభాస్ ఉన్నాడని అంటున్నారు.ఎనభయ్యేళ్ల వయసులో కృష్ణం రాజు చురుకైన రాజకీయం చేసే స్థితిలో లేరు అన్నది నిజం. ఆయన్ని ఇపుడు అర్జంటుగా తీసుకువచ్చి రాజ్ భవన్ లో కూర్చోబెడితే ఒనగూడేది ఏంటి అన్న చర్చ అయితే ఉంది. దానికి సమాధానమే ప్రభాస్ రాజు. గోదావరి జిల్లాలో బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణం రాజుని గవర్నర్ గా చేయడం ద్వారా ఇటు ప్రభాస్ ని తమ వైపునకు తిప్పుకోవాలని అతి పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు. అలాగే క్షత్రియ సామాజిక వర్గం బలాన్ని సొమ్ము చేసుకోవాలన్న ఆశ కూడా ఉందని అంటున్నారు.బీజేపీకి ఈ తడవ గెలిచేందుకు దక్షిణాది రాష్ట్రాల ఓట్లూ సీట్లు కావాలన్నది నిజం. ఉత్తరాదిన యాంటీ ఇంకబెన్సీతో ఉన్న ఓట్లూ సీట్లూ తగ్గుతాయి. దాంతో 130 దాకా ఉన్న ఎంపీ సీట్లతో మెజారిటీ గెలుచుకునేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందని అంటున్నారు. బాహు బలితో పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ ని రంగం లోకి దింపడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి కొత్త ఊపు తేవాలని బీజేపీ పెద్దల ఆలోచనగా ఉందిట. అందులో భాగంగానే కృష్ణం రాజుకు గవర్నర్ పదవి తాయిలం అంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.