విజయవాడ జనవరి 19
ఏపీ జెఏసీ అమరావతి పక్షాన గవర్నర్ ను కలిసాం. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను 7 పేజీల లేఖలో సమర్పించామని ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జెఏసీ చైర్మన్, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన పెద్ద విపత్తుకు ప్రైవేటు రంగం భయపడి పక్కన ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నాం. కరోనాని ఎదుర్కొన్న ఘనత ప్రభుత్వ ఉద్యోగులదే. రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రభుత్వ అభ్యర్ధనను వ్యతిరేకించి ఎన్నికల నిర్వహణకు సిద్ధవడం జీర్ణించుకోలేకపోయాం. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో అయ్యేది కాదు. లక్ష నలభైవేల పోలీస్ స్టేషన్లు పరిశీలించాలి. బ్యాలెట్ బాక్సులు, సరంజామా మొత్తం తీసుకోవాలి. ఎక్కడైనా కరోనా బారిన పడచ్చు. పోలింగ్ తరువాత కూడా కోవిడ్ సమస్య రావచ్చు. నాలుగు లక్షల పీపీఈ కిట్లు ఎలా తెస్తారని అడిగారు.
తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు జరిపితే ముప్ఫై శాతం ఓటింగ్ దాటలేదు. పంచాయితీ ఎన్నకలంటే వందశాతం పోలింగ్ ఆశిస్తారు. ప్రజలకు ఎన్నికల అవేర్నెస్ ఎంత ఇచ్చినా భయాందోళనలలో ఉన్నారు. రెండు మూడు లక్షల సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. కరోనా మహమ్మారి ముమ్మరంగా ఉన్నపుడే పీపీఈ కిట్లు లేవని అన్నారు.
2018 నుంచీ ఎన్నికలు జరపకుండా ఇప్పుడెలా. ఎన్నికల కమీషన్ పంతానికీ.. మా ప్రాణాలను పణంగా పెడతారా. హైకోర్టులో నోటిఫికేషన్ సస్పెండ్ అయినా వదలకుండా ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కు వెళ్ళారు. ఎస్ఈసీ కి ఇంత పంతం అవసరమా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వమే కుదరదని అన్నప్పుడు ఎస్ఈసీ ఎందుకు పంతం పడుతున్నారో చెప్పాలి. ఈ రాష్ట్రంలో వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తే కానీ పని చేయదు అని శాస్త్రవేత్తలే చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ ప్రతీ ఉద్యోగికి అందే వరకూ ఎన్నికలు జరగకుండా గవర్నర్ చూడాలని కోరాం. గవర్నర్ విచక్షణ అధికారాలతో ఈ అంశాన్ని పరిశీలించాలని కోరాం. గవర్నర్ చాలా సానుకూలంగా స్పందించారని అన్నారు.