శ్రీకాకుళం జనవరి 19,
శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 పూరిళ్లు దగ్ధమ య్యాయి. సుమారు 25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.ఈ ఘటనలో పలువురి ఇళ్లు కాలి బూడిదయ్యాయి. బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేసినా.. ప్రయోజనం లేకపోయింది. బియ్యం, నగదు, బంగారం, చేపలు, వలలు, దుస్తులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయని బాధితులంతా ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ.. అగ్నిప్రమాదం సంభవించడంతో జాగ్రత్త పడేందుకు కూడా వీలులేకపోయిందని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.తహసీల్దారు జామి ఈశ్వరమ్మ, రెవెన్యూ పరిశీలకులు చిన్నారావు, వీఆర్వో చక్రధరరావులు బాధితులను పరామర్శించారు. ప్రమాద విషయాన్ని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వం నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.