విజయవాడ, జనవరి 19
మొత్తానికి ప్రత్యర్ధుల జోస్యాలు ఇన్నాళ్ళకు ఫలిస్తాయా. జగన్ జైలు అంటూ మంచి రైమింగ్ తో టైమింగుతో తరచూ సెటైర్లు వేసే జగన్ ఆగర్భ శత్రువుల కోరికలు తీరే రోజులు వచ్చేసినట్లేనా. ఈడీ కోర్టు జగన్ విజయసాయిరెడ్డిలను స్వయంగా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడంతో కధ వేగంగా సాగుతోందని అందరికీ అర్ధమవుతోంది. జగన్ ఎంపీ కానపుడు తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూ ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారు అన్న దాని మీద ఈడీ కోర్టులో విచారణ చేస్తోంది ఆర్ధిక నేరాల కేసులో జగన్ మీద వచ్చిన అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలు ఈడీ సేకరించిందని చెబుతున్నారు. మనీ లాండరింగ్ కేసుల్లో జగన్ తప్పకుండా బుక్ అయి తీరుతారు అని కూడా అంటున్నారు. సీబీఐ కేసులు జగన్ కి పెద్దగా సమస్య కాకున్నా ఈడీ కేసులు మాత్రం చాలా తీవ్రంగానే జగన్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని కూడా ఈ రంగాన నిపుణత సాధించిన వారు అనే మాట. ఇక ఈ విషయం మీద గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పిన మాట ఒకటి ఉంది. ఈడీ కేసులే జగన్ కి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని అప్పట్లో ఉండవల్లి కూడా చెప్పారు. ఆయన స్వతహాగా న్యాయవాది కూడా. జగన్ మీద కేసులు ఇలా విరుచుకుపడితే రక్షించేది ఎవరు, అసలు ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది అన్నది కూడా హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. జగనే అన్నింటికీ మూల బిందువు. ఆయనే అటు పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా. అలాంటిది జగన్ కనుక ఈడీ కేసుల్లో ఇరుక్కుంటే సర్కార్ భవిష్యత్తు ఏంటి అన్నది కూడా వైసీపీలో వాడి వేడి చర్చగా ఉందని అంటున్నారు. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు కానీ ఇపుడు ముఖ్యమంత్రిగా కానీ బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్న సంగతి విదితమే. ఏపీలో ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకున్న జగన్ కేంద్రాన్ని ఏ విషయంలోనూ గట్టిగా ఇంతవరకూ నిలదీయలేదంటే అది కచ్చితంగా భవిష్యత్తు అవసరాల కోసమే అని ప్రత్యర్ధులు ఎపుడూ విమర్శిస్తూ ఉంటారు. మరి ఆ అవసరం జగన్ కి ఇపుడు వచ్చిందా అన్నదే ప్రశ్న. ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ మాత్రం తేడా కొట్టినా ఆ స్పేస్ లోకి దూసుకురావడానికి బీజేపీ రెడీగా ఉంటుందన్నది వేరేగా చెప్పాల్సింది లేదు. చంద్రబాబు టీడీపీకి గ్రాఫ్ పెద్దగా పెరగలేదు. ఏపీలో మరే పార్టీకి కూడా అధికారంలోకి వచ్చే చాన్స్ లేదు. బలమైన వైసీపీ ఇబ్బందులో పడితే దాన్ని ఎలా వాడుకోవాలో అలాగే బీజేపీ వాడుకుంటుంది అంటున్నారు. మరి జగన్ ఈ విషయంలో ఏం చేస్తారు, కేంద్రం ఆయనతో సయోధ్యతో ఉంటుందా లేక తెర ముందుకు తానే వస్తుందా అన్నది కూడా చర్చగానే ఉంది. ఏది ఏమైనా ఈడీ కేసుల్లో వేగం పెరగడం వెనక కూడా రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ బీజేపీతో శరణామా రణమా ఏ మార్గం ఎంచుకుంటారు అన్న దాని మీదనే ఏపీ రాజకీయాలలో అనూహ్య మార్పులు సంభవిస్తాయి అంటున్నారు.