YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మేయర్ కోసం లాబీయింగ్...

మేయర్ కోసం లాబీయింగ్...

హైదరాబాద్, జనవరి 20, 
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఆశావహులు మేయర్ సీటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు. ఇందుకోసం టీఆర్ఎస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వచ్చే నెల 10 తర్వాత నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో ఎస్ఈసీ శనివారం కొత్త కార్పొరేటర్ల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్  విడుదల చేసింది. చట్టం ప్రకారం గెజిట్ విడుదల చేసిన నెల రోజుల్లోపు  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులను లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పుడు జీహెచ్ఎంసీ మేయర్  జనరల్ మహిళకు దక్కింది. దీంతో మేయర్ సీటును సొంతం చేసుకునేందుకు పెద్ద పెద్ద లీడర్ల కూతుళ్లు, కోడళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు లీడర్ల భార్యలు కూడా ఇందు కోసం పోటీ పడుతున్నారు.జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ స్థానం సంపాదించుకున్నా.. బీజేపీ కంటే కేవలం 8 సీట్లే ఆ పార్టీకి ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రతి కౌన్సిల్ సమావేశంలో బీజేపీ సభ్యులు టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే  చాన్స్  ఉంది. అందుకని కౌన్సిల్ సమావేశాలను చాకచక్యంగా నిర్వహించే మేయర్ అభ్యర్థి కోసం టీఆర్ఎస్  వెతుకుతోంది. రాజకీయ పరిజ్ఞానం, వివిధ సమస్యలపై అవగాహన ఉన్న మహిళా కార్పొరేటర్లు ఎవరనేది ఆరా తీస్తోంది. ఒక్కొక్కరి పూర్తి బయోడేటాను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు సమాచారం.పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా టీఆర్ఎస్ పార్టీనే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోనుంది. మొత్తం 150 డివిజన్లలో మేయర్ సీటు సొంతం చేసుకునేందుకు సగం కంటే ఒకటి ఎక్కువ సీట్లు అంటే 76 సీట్లు గెలవాలి. కానీ టీఆర్ఎస్  56 సీట్లనే గెలిచింది. మజ్లిస్ తో ఎలాంటి అవగాహన లేకుండానే, తనుకున్న ఎక్స్ అఫీషియో ఓట్లతో  టీఆర్ఎస్ మేయర్ సీటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లు, 32 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లు, బీజేపీకి 48 కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో ఓటర్లు, మజ్లిస్ కు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్కు  ఇద్దరు కార్పొరేటర్లు, ఒక్క ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. అయితే బీజేపీకి చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ రమేశ్గౌడ్ ఇటీవల చనిపోయారు.కూతుళ్లకు దీటుగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే కోడళ్లు కూడా మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధూ ఆదర్శ్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కార్పొరేటర్ గా పనిచేసిన సింధూ ఈసారి మంచి మెజార్టీతో గెలిచారు. అయితే మేయర్ పదవిని సిటీలోని  కార్పొరేటర్లను కాదని శివారులోని కార్పొరేటర్ కు కట్టబెడితే విమర్శలు వస్తాయనే టాక్ ఉంది. మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి, లీడర్లు మన్నె గోవర్దన్రెడ్డి భార్య మన్నె కవిత, మోతే శోభన్ రెడ్డి భార్య శ్రీలత కూడా మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.ఎంపీ కె.కేశవరావు కూతురు విజయలక్ష్మి మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు టీఆర్ఎస్లో  చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లోనే మేయర్ సీటు కోసం ఆమె ప్రయత్నించారు. పార్టీలో చేరిననాటి నుంచి ఇప్పటివరకు కేకే కు సీఎం కేసీఆర్ ప్రయార్టీ ఇస్తున్నారని, కేకే కూడా పార్టీలో నిలబద్దతతో ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. తన తండ్రి నిబద్దతనే తనకు కలిసి వస్తుందని విజయలక్ష్మి ధీమాగా ఉన్నారు. కానీ కేకేకు రెండోసారి రాజ్యసభ సీటు ఇవ్వడంతో విజయలక్ష్మికి మేయర్ సీటు దక్కే చాన్స్ తక్కువని పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారుదివంగత నేత పీజేఆర్ చరిష్మాతో మేయర్ సీటును సొం తం చేసుకునేం దుకు ఆయన కూతురు విజయారెడ్డి ప్రయత్నిస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్ని కల్లోనే ఆమె మేయర్ పదవి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి ఫెయిలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటు అడిగారు. కానీ టీఆర్ఎస్ పెద్దలు కాంగ్రెస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ కు సీటు ఇవ్వడంతో మరోసారి ఆమెకు చుక్కెదురైంది. ఈసారి మాత్రం తనకు మేయర్ సీటు దక్కుతుందనే ధీమాలో విజయారెడ్డి ఉన్నట్టు ఆమె సన్ని హితులు చెప్తున్నారు.గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించిన నెలన్నర తర్వాత విజేతల పేర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు రాగా.. శనివారం విజేతల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల్లో గెలిచిన వారి పేర్లతో గెజిట్‌‌ జారీ చేస్తే.. గెజిట్‌‌ ఇచ్చిన రోజు నుంచి 30 రోజుల్లోపు కొత్త పాలకవర్గం మొదటి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. పాత పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి పదో తేదీ వరకు ఉండటంతో ఆ గడువు ముగిసే సమయానికి కొత్త పాలకవర్గం మొదటి సమావేశం నిర్వహించేలా ఎస్‌‌ఈసీ ఆలస్యంగా గెజిట్‌‌ జారీ చేసింది. ఫిబ్రవరి 9 లేదా 10న  కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తెల్లారి లేకపోతే ఆ తర్వాత రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని ఎస్ఈసీ వర్గాలు అంటున్నాయి. మొత్తం ప్రాసెస్ ఫిబ్రబరి 15 లోపు ముగుస్తుందని చెప్తున్నాయి.

Related Posts