విశాఖపట్టణం, జనవరి 21
తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం నడుస్తోంది అని చెప్పాలి. వైసీపీ వేసిన ఎత్తుల వల్ల ఆర్ధికంగా పార్టీకి పెద్ద దిక్కుగా భావించే నేతలంతా జారిపోయారు. విశాఖ రాజకీయాలే తీసుకుంటే టీడీపీకి గట్టి పట్టుంది. అయితే జనంలో ఎంత అభిమానం ఉన్నా ఆర్ధికంగా అండదండలు కూడా అవసరం. ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏ పార్టీకైనా అది పరీక్షా సమయమే. వైసీపీ అధికారంలోకి రావడంతోనే విశాఖ మీద కన్నేసింది. అంతే కాదు తెలుగు దేశం పార్టీ ఆర్ధిక మూలాలను కూడా కుదిపేసింది.ఆర్ధికంగా గట్టి మనిషి అని పేరున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇపుడు సైలెంట్ గా ఉంటున్నారు. గంటా వంటి వారు అధికారంలో ఉన్నపుడు అంతా తామేనని కధ నడిపేవారు. నాడు పార్టీ పవర్ లో ఉండడంతో ఎవరి అవసరం పెద్దగా లేకుండా పోయింది. కానీ ఇపుడు తెలుగుదేశం ప్రతిపక్షంలోకి చేరింది. అడుగు తీసి ముందుకు కదపాలంటే కష్టమే. అంతా కాసులతో పనే. కానీ ఈ కీలకమైన సమయంలో గంటా శ్రీనివాస్ సైడ్ ఒక్కసారిగా అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అంటే టెక్నికల్ గా మాత్రమే ఉన్నారనుకోవాలి. దీంతో గంటా శ్రీనివాస్ నుంచి ఆర్ధికంగా సాయం ఏదీ అందకుండా పోతోంది.ఇక గంటా శ్రీనివాస్ అంత కాదు కానీ తెలుగుదేశానికి కొద్దో గొప్పో నగర రాజకీయాల్లో సహకరించే పెద్ద దిక్కు వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వరసగా రెండవ మారు గెలిచారు. ఆయన నగర అధ్యక్షుడిగా పలు మార్లు పనిచేశారు. ప్రత్యేకించి పార్టీ విపక్షంలో ఉన్న వేళ వాసుపల్లి గతంలో నిలబెట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కానీ ఇపుడు ఆయన వైసీపీలోకి జంప్ చేశారు. దాంతో విశాఖ వంటి సిటీలో తెలుగుదేశం కార్యక్రమాలు పెద్దగా కనిపించకుండా పోయాయి. చంద్రబాబు పిలుపు ఇస్తున్నా పట్టించుకున్న వారు లేకుండా పోయారు.తొందరలో జీవీఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీకి నిధుల కొరత లేదు. పైగా చేతిలో పవర్ ఉంది. ప్రతీ డివిజన్ కి రెండు మూడు కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీ అన్న వారే అక్కడ ఆభ్యర్ధులుగా ఉన్నారు. మరి టీడీపీకి అంత సీన్ ఉందా అన్నదే ప్రశ్న. జీవీఎంసీ ఎన్నికల బాధ్యతలు ఎవరికి అప్పగించినా నిధుల విషయంలో చేతులు ఎత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఉన్న ఎమ్మెల్యేలతో గణబాబు పశ్చిమకే పరిమితం. పైగా ఆయన ఆర్ధికంగా అంత బలం కాదు. తూర్పు నుంచి వెలగపూడి రామక్రిష్ణ బాబు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన తన నియోకజవర్గం వరకూ చూసుకోవడమే కష్టమని అంటున్నారు. వైసీపీ ఆయన్ని టార్గెట్ చేయడంతో అన్నింటా చిక్కుల్లో ఆయన ఉన్నారు. మొత్తానికి వైసీపీ వేసిన ఆర్ధిక చక్ర బంధంలో చిక్కుకుని తెలుగుదేశం విలవిలలాడుతోంది అంటున్నారు. ఇలాగే సీన్ ఉంటే వైసీపీ దే మేయర్ పీఠమని కచ్చితంగా చెప్పేయవచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి.