YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

అనంతవాయువుల్లో కలిసిన ఓ ప్రాణదాత ప్రాణం

అనంతవాయువుల్లో కలిసిన ఓ ప్రాణదాత ప్రాణం

108, 104 పధకాల రూపశిల్పి డాక్టర్ అయితరాజు పాండు రంగారావు ఇక లేరు. అనేకమందికి ఆపత్సమయంలో ప్రాణం పోసిన డాక్టర్ రంగారావు, 75 ఏళ్ళ వయస్సులో ప్రాణాంతక వ్యాధి కేన్సర్ బారిన పడి, గత మూడు మాసాలుగా దానితో అవిశ్రాంత పోరాటం జరిపి ఇక అలసిపోయి ఏప్రిల్ 15 ఆదివారం తెల్లవారుఝామున శాశ్వత విశ్రాంతిలోకి జారిపోయారు.

ఖమ్మం జిల్లా, వల్లభి వాస్తవ్యులయిన డాక్టర్ రంగారావు, హైదరాబాదు గాంధి వైద్యశాలలో మెడిసిన్ పూర్తిచేసుకుని, ఇంగ్లాండ్ లో పై చదువులు చదివి, ఇండియాకు తిరిగివచ్చిన తరువాత ఏరికోరి బూర్గుంపాడు, భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి  ప్రభుత్వ డాక్టరుగా సేవలు అందించారు. డాక్టరుగా ఉద్యోగం చేసిన రోజుల్లోను,  ఆ తర్వాత కూడా  ప్రైవేటు ప్రాక్టీసు అనే పదాన్ని తన దగ్గరకు చేరనివ్వలేదు. నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించడంలో ఆయన పాటించే నిబద్ధత చాలా గొప్పది. తరతమ బేధాలు లేకుండా రోగులను కనిపెట్టి చూసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఏ పధకం గురించి ఆలోచించినా ఆయన కోణం ఒక్కటే, ‘దీనివల్ల సామాన్యుడి ఏమాత్రం ప్రయోజనం వుంటుంది?’.  ఈ ప్రశ్నకు సరయిన సరైన సమాధానం లభించకపోతే ఆయన ఏమాత్రం సమాధానపడేవాడు కాదు. తన మనసులోని భావాలను ఆయన నిక్కచ్చిగా వెల్లడించేవాడు. అవతల వ్యక్తి ముఖ్యమంత్రా, పెద్ద అధికారా, అతి సామాన్యుడా అనేదానితో ఆయనకు నిమిత్తం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నా, రెడ్ క్రాస్ సంస్థకు రాష్ట్ర స్థాయిలో నేతృత్వం వహిస్తున్నా, దుర్గాభాయ్  దేశముఖ్ హాస్పిటల్ చైర్మన్ గా పనిచేసినా డాక్టర్ రంగారావుది ఇదే వరస. పదవులను పట్టుకుని వేలాడే తత్వం కాకపోవడంచేత ప్రతి ఉద్యోగంలో ఆయన తాను  అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాడు. ఎక్కడా రాజీపడిన దాఖలాలు లేవు.

విషయాలను విశదీకరించేటప్పుడు ఆయన సామాన్యుడి భాషలో మాట్లాడేవాడు. క్లిష్టమైన సాంకేతిక పదజాలం ఆయన నోటివెంట వెలువడేది కాదు. అలనాటి ప్రభుత్వాలను ఒప్పించి, ఆయన ప్రవేశ పెట్టిన ‘జైపూర్ ఫుట్’ పధకం ప్రమాదాల్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్లకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

పదవీవిరమణ అనంతరం సత్యం ఫౌండేషన్ తో కలిసి పనిచేశారు.  ఆ సమయంలో ఆయన మరి కొన్ని వినూత్న పధకాలకు శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాద బాధితులపట్ల వరదాయినిగా మారిన 108 అంబులెన్స్ సర్వీసు, నెలనెలా గ్రామాలకు వెళ్లి క్రమం తప్పకుండా బీదసాదలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే  104 సంచార వైద్య పధకం ఆయన మెదడులో ఊపిరి పోసుకున్నవే.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే అనే సంగతి తెలియకపోవచ్చు. దానికి కారణం, తాను నమ్మినదాన్ని చిత్తశుద్ధితో చేసుకుంటూ పోవడమే. ప్రచారం కోసం పాకులాడకపోవడమే.
ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడుపుతూ, అందరిమల్లే ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటూ రోజులు దొర్లించి వుంటే, ఆయన గురించి ఇలా రాయాల్సిన అవసరమే వుండేది కాదు. ఎన్నో ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు,  డాక్టర్లకు నేర్పే మరో నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.

రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదుచేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

ఈ పాఠం నేర్పిన స్పూర్తితో, వైద్యవృత్తిని తన జీవిత పర్యంతం పేదసాదలకోసం అంకితం చేసి చివరకు ఏప్రిల్ పదిహేనో తేదీ తెల్లవారుఝామున కన్నుమూసిన డాక్టర్ రంగారావు, ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ధన్యజీవి. 

వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్  -


భండారు శ్రీనివాసరావు

Related Posts