అనంతపురం జనవరి 21
వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి హల్చల్ చేశారు. ఎల్లనూరు మండలానికి పెద్దారెడ్డి వ్యక్తిగత పనికోసం వెళ్లారు. అక్కడ తాహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి.. ఆకస్మిక తనిఖీ చేశారు. అంతేకాదు తహసీల్దార్ కుర్చీలో కూర్చున్నారు. ఆఫీస్కు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మండిపడ్డారు. తన నియోజకవర్గం కాకపోయినా మేజిస్ట్రేట్ హోదా అయిన తహసీల్దార్ కుర్చీలో కూర్చోవడం.. ఆఫీస్లో హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది. తన నియోజవర్గం కాకపోయినా ఆయన ఎందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆయన పనికోసం వచ్చినా.. అధికారులు ఉన్నప్పుడు రావాలని, అధికారులు లేనప్పుడు వచ్చి ఇలా వ్యవహరించడంపై ఉద్యోగుల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పైగా మండల మేజిస్ట్రేట్ కూర్చీలో కూర్చోని ఆదేశాలివ్వడం ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెద్దారెడ్డి తీరుపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తాడిపత్రిలో జరిగిన వరుస ఘటనలతో పెద్దారెడ్డి వార్తల్లోకి ఎక్కారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో ఇంటికెళ్లి హంగామా సృష్టించారు.