అమరావతి జనవరి 21
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం హైకోర్టు ఎన్నికల నిర్వహణపై తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డిస్మిస్ చేసింది. ఈ నెల 8న ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ నెల 11న షెడ్యూల్‌ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ అనేది కరోనా వ్యాక్సినేషన్‌కు అడ్డురావొద్దని ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సీఎస్‌ఈ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. పిటిషన్‌పై రెండు రోజుల కిందట విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఏపీలో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యాక్సినేషన్‌కు ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం ముఖ్యమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఎస్‌ఈసీ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ నాలుగు విడుతల్లో జరుగనుంది. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్‌సీఈ పేర్కొంది.