అమరావతి జనవరి 21
ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడుల వ్యవహారం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఈక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు, ఏపీ బీజేపీ నేతల మధ్య వివాదం మరింత ముదిరింది. రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు కొందరు బీజేపీ కార్యకర్తలకు సంబంధం ఉందంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. తమ పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన డీజీపీ ఈనెల 20లోగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని.., క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా జరగని క్రమంలో తీవ్ర పరిణామాలుంటాయని.., డీజీపీపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కమలనాథుల విధించిన డెడ్ లైన్ పూర్తికావడంతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడలోని సోము వీర్రాజు నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఆయన బయటకి రాకుండా అడ్డుకున్నారు. అలాగే ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని గన్నవరం ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఎక్కడిక్కకడ హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బెంజి సర్కిల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఉండటంతో బీజేపీ నేతలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.