YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ...విజయం సాధించారా

నిమ్మగడ్డ...విజయం సాధించారా

విజయవాడ, జనవరి 22, 
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఒకసారి షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికలను ఆపకూడదని ఎస్ఈసీ తరుపున న్యాయవాది వాదించారు. ఇటు ప్రభుత్వం కూడా కోవిడ్ వ్యాక్సినేన్ ప్రక్రియ నడుస్తున్నందున ఇప్పట్లో ఎన్నికలు జరపలేమని పేర్కొంది.అయితే హైకోర్టు మాత్రం ఇటు ప్రజారోగ్యం, అటు ఎన్నికలు రెండూ ముఖ్యమేనని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించింది. కానీ హైకోర్టు సూచనలు అమలవుతాయా? అన్నది ప్రశ్నగా మారింది. హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి రెడీ అయ్యారు. ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని తెలుస్తోంది.కానీ గతంలో అనేక రాష్ట్రాల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే సుప్రీంకోర్టులో కూడా జగన్ ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తాను అనుకున్నట్లుగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలను జరిపేందుకు రెడీ అవుతున్నారు.మరోవైపు ఉద్యోగులు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్దంగా లేరు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో చేరేందుకు కూడా ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెగ్గినట్లే. కానీ ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో కఠినంగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది.
సుప్రీం కోర్టుకు సర్కార్
హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించిన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండటం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు జరపకుండా షెడ్యూల్ ను విడుదల చేయడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేరన్న విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ మేరకు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ ఫైల్ చేయడానికి సిద్దమయ్యారు.

Related Posts