గుంటూరు, జనవరి 22,
పిల్లి పోరు.. పిల్లి పోరు.. పిట్ట తీర్చింది.. అనే సామెత టీడీపీలో నిజమవుతోందని అంటున్నారు పరిశీలకులు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజుకో రకంగా మారుతోంది. ఇక్కడ పార్టీ బాధ్యతలను ఎవరికీ అప్పగించేలేదు. అయితే ఇక్కడ పార్టీ బాధ్యతలు తమకు కావాలంటే తమకు కావాలంటూ టీడీపీలో నేతలు రోడ్డెక్కుతున్నారు. ఇది వర్గపోరుకు ప్రాధాన్యం ఇస్తోంది. నిజానికి ఈ ఇంచార్జ్ సీటును దివంగత కోడెల కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే.. ఆయనతో ఇక్కడి లోకల్ కేడర్ తీవ్రంగా విభేదిస్తోంది. ఆయన తప్ప.. అనే మాటను బలంగా వినిపిస్తున్నారు లోకల్ నాయకులు.కోడెల శివరాం విషయంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. శివరాం వ్యవహారాల వల్ల వ్యక్తిగతంగా కోడెల కుటుంబాని కన్నా.. పార్టీకి ఎక్కవ నష్టం జరిగిందని క్యాడర్ భావిస్తోంది. దీంతో శివరాంను వ్యతిరేకిస్తూ.. నియోజకవర్గంలో మరోవర్గంగా ఉన్న మన్నెం శివనాగమల్లేశ్వరావు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019లోనే కోడెలకు సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేసిన మల్లిబాబు.. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు. ఈసారి సత్తెనపల్లి సీటు తనే సాధించాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఏ పిలుపు ఇచ్చినా.. తన కటౌట్లతో రంగంలోకి దిగిపోతున్నారు. ఇక, శివరాంను వ్యతిరేకించే వర్గం కూడా ఈయనతో జట్టు కట్టింది.ఇక కోడెల హయాంలో నాగమల్లేశ్వరరావును ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక చంద్రబాబు సైతం ముందుగా ఇక్కడ పార్టీ పగ్గాలు కోడెల వారసుడికి ఇవ్వకూడదని అనుకున్నా… కోడెల ఫ్యామిలీని పక్కన పెట్టారన్న పేరు జిల్లాలో ఎక్కువుగా వినిపిస్తోన్నందున ఆయన వెనక్కు తగ్గారు. ఇక నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్న రాయపాటి వర్గం కూడా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. దీంతో సత్తెనపల్లి పార్టీ పగ్గాల విషయంలో ఏం తేల్చకుండా నాన్చుతూ వస్తున్నారు. ఇది టీడీపీలో వర్గ పోరుకు దారితీసి.. తటస్థంగా ఉన్న నాయకులు ఎవరికి మద్దతు పలకాలో తెలియక తలపట్టుకున్నారని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. ఇక్కడ నుంచి విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అసహనం ఉంది.ఆయన అభివృద్ధి కన్నా.. వ్యక్తిగత రాజకీయాలకు ప్రాదాన్యం ఇస్తున్నారనే వాదన బలంగా ఉంది. అయితే.. టీడీపీ బలంగా లేక పోవడం, ఉన్న నేతలు కూడా వారిలో వారు కలహాలకు దిగుతుండడంతో అంబటి నిశ్చితంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు.. రాజకీయంగా టీడీపీకి సెగ పుట్టిస్తుండగా.. వైసీపీలో మాత్రం సంతోషం పుట్టిస్తోందని చెబుతున్నారు. మొత్తంగా టీడీపీలో నేతల మధ్య సఖ్యత తీసుకువచ్చి.. ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తే.. ఈ రగడకు తెరపడి.. పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి బాబు ఆదిశగా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.