శ్రీకాళహస్తి జనవరి 22,
తిరుపతి-పీలేరు మార్గం లోని అడవుల్లో నుంచి వస్తూ పలుసార్లు పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్లు ఈసారి ఏర్పేడు మార్గాన్ని ఎంచుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటయ్య ఆ మార్గం వైపు దృష్టి సారించారు. దీంతో గురువారం రాత్రి ఆర్ ఎస్ ఐ లింగాధర్ బృందాన్ని ఏర్పేడు అటవీ ప్రాంతానికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆరుగురు వ్యక్తులు కృష్ణా పురం బీట్ లోని అడవుల్లోకి ప్రవేశి స్తుండగా గమనించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించగా తమవద్ద ఉన్న బ్యాగులను వదిలి పారిపోయారు. బ్యాగులు చూడ గా అందులో దుస్తులతో పాటు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు కనిపించినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. అందులో తూనిక యంత్రం, భక్తుడిలా వేషం మార్చడానికి కాషాయ రంగు తువ్వాలు, చెట్లు కొట్టిన తరువాత చెక్కడానికి ఉపయోగించే బ్లేడ్ లు, ఆహార పదార్థాలు కూడా లభించాయన్నారు. లభించిన వస్తువులను బట్టి వీరు తమిళనాడు వాసులుగా గుర్తించి నట్లు తెలిపారు. వీరి కోసం అడవుల్లో గాలిస్తున్నట్లు తెలిపారు.