YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల మోత

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల  మోత

హైదరాబాద్, జనవరి 22, 
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీస్టీ ఛార్జీల షాక్ ఇవ్వనుంది. 2019 డిసెంబరు నెలలో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచిన ఆర్టీసీ.. ఏడాది తర్వాత మళ్లీ ఛార్జీల పెంపునకు సిద్ధమైంది. ఈ సారి కిలోమీటరుకు 10 పైసలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు నివేదిక అందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆయనతో గురువారం చర్చించారు. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడం, లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో చార్జీల పెంపు తప్పదనే అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.‘గతంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర రూ.67 ఉండేది. కానీ ఇప్పుడు లీటర్‌కు రూ.15 పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం మోపింది. మరోవైపు కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ ఆర్టీసీ పరిస్థితిని మరింత దిగజార్చింది. దీనికి తోడు ఇప్పటికే పేరుకుపోయిన రుణ బకాయిలతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాల్సి ఉంది. ప్రస్తుతం ఆ భారాన్ని సంస్థ భరించే స్థితిలో లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి సాయం చేయాలి. దీంతో పాటు ఛార్జీలు పెంచితేనే సంస్థ మనుగడ సాధ్యమవుతుంది. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ కోలుకునే పరిస్థితి లేదు’ అని అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఆర్టీసీ వ్యయంలో 52 శాతం జీతభత్యాలకే వెళ్లిపోతోంది. జీతాల భారం 50 శాతం దాటితే ఏ సంస్థ మనుగడ అయినా కష్టమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటిది ఇప్పటికే 52శాతం వ్యయం జీతాలకే వెళ్లిపోతుండటం, మళ్లీ జీతాలు పెరుగుతుండటంతో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోక తప్పదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఆదాయం ఇప్పటికిప్పుడు అసాధ్యం కాబట్టి ఛార్జీల పెంపు తప్ప మరో మార్గం కనిపించటం లేదని తేల్చేశారు. అలా కాని పక్షంలో బడ్జెట్లో ఆర్టీసీకి కనీసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సిబ్బంది జీతాల వ్యయం ప్రస్తుతం ప్రభుత్వమే భరిస్తున్నందున, మరిన్ని నిధులు ఇవ్వడం అసాధ్యమని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్జీల పెంపు తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
భారీగా పెరగనున్న సిటీ సర్వీసులు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 75 శాతం సిటీ బస్సులు నడపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత సెప్టెంబరు 25న సిటీ బస్సు సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కరోనా భయంతో నగరంలో కేవలం 25శాతం బస్సులు సర్వీసులకు మాత్రమే తొలుత అనుమతి ఇవ్వగా.. తర్వాత దాన్ని 50శాతానికి పెంచారు. ఫిబ్రవరి 1నుంచి జిల్లా సర్వీసులు పూర్తిస్థాయిలో తిరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో సిటీ బస్సు సర్వీసులను 75 శాతానికి పెంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతించారు. రవాణా శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఛార్జీల పెంపుపైనా ఆసక్తికర చర్చ సాగింది. ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థలు కూడా తెరుచుకోనున్న నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచుకోవడానికి అనుమతివ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రిని కోరారు.

Related Posts