వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంపై తీవ్ర కసరత్తులే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 40 నుంచి 60 మంది వరకూ టిక్కెట్లు దక్కవన్నది ఆ పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. ఈ 60 మందిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఎక్కువ మంది పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలే.ప్రశాంత్ కిషోర్ కమిటీ ఇప్పటికే మూడు నివేదికలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేవలం ఈ నివేదికల ఆధారంగా మాత్రమే కాకుండా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్నది జగన్ నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి కాకుండా పార్టీకోసం పనిచేసిన వారికి ఇవ్వడంతో అనేక స్థానాలను చేజేతులా కోల్పోయామని వైసీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గానికి ఈసారి కొన్ని జిల్లాల్లో సీట్లు అధికంగా ఇచ్చే అవకాశముంది. అయితే పీకే టీం సర్వేల్లో గత నాలుగేళ్లగా పనిచేయకుండా ఉన్న నేతలు కేవలం నాలుగు నెలల నుంచే పనిచేస్తున్నారు. అంతకుముందు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను కూడా సక్రమంగా చేపట్టలేదు. జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాతే ఆ నేతలు పనిచేయడం ప్రారంభించారన్న నివేదికలు కూడా జగన్ కు చేరాయి.గత ఎన్నికల్లో చేసిన తప్పును ఈసారి చేయకూడదని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తే కొందరు సక్రమంగా ప్రజల్లోకి వెళ్లకుండా, మరికొందరు డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్లనే ఓటమి పాలయ్యామని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో గత ఎన్నికల్లో సామాజిక వర్గాల సమతుల్యతను అభ్యర్థుల ఎంపికలో పాటించలేదన్నది జగన్ కూడా నేతల ముందు అంగీకరిస్తున్నారు.నాలుగేళ్లుగా తాము పార్టీ కోసం కష్టపడుతున్నామని నియోజకవర్గ ఇన్ ఛార్జులు చెబుతున్నప్పటికీ, అది ఉత్తుత్తిదేనని జగన్ చేయించుకున్న సొంత సర్వేల్లో స్పష్టమైనట్లు తెలిసింది.నలభై నుంచి అరవై మంది వరకూ నేతలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. టిక్కెట్లు ఇవ్వని నేతలతో జగన్ వన్ టు వన్ మాట్లాడి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే పాదయాత్ర సమయంలో ఏ నియోజకవర్గంలోనూ అభ్యర్థిని జగన్ ప్రకటించడం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కేవలంల నాలుగైదు నియోజకవర్గాలకు మాత్రమే పాదయాత్ర సందర్భంగా జగన్ అభ్యర్థులను ప్రకటించారని, మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. అభ్యర్థులను మారిస్తేనే వైసీపీకి ప్లస్ అవుతుందని సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
వైసీపీ క్యాండిట్లలలో సర్వే టెన్షన్.....!!