విజయవాడ జనవరి 22,
కొంతకాలం క్రితం బెజవాడ కనకదర్గమ్మ గుడిలో వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమలు చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు నాలుగు నెలలక్రితం ఈ ఘటన జరగగా ఈ కేసు మిస్టరీ వీడింది. గత ఏడాది సెప్టెంబర్లో విగ్రహాలు మాయమయ్యాయి. ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా (52) పనేనని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించారు. నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. ఈ కేసును పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టారు. ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందిని.. ఆలయంలో పనులు చేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులను ఇదే తరహా నేరాలు చేసే పాత నేరస్థులను అదుపులోకి తీసుకొని పక్కా ఆధారాలతో విచారణ చేపట్టారు. చివరకు కేసును ఛేదించారు. సాయిబాబా ఇప్పటికే ఇటువంటి నేరాలు పలు చేసినట్టు పోలీసులు తెలిపారు.ప్రత్యేక బృందంలోని ఓ ఎస్సై.. సాయిబాబా కార్యకలాపాలపై దృష్టిసారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 2007 2008 మధ్యలో జక్కంశెట్టి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు అతనిపై వంద కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి నరసాపురం పాలకోడేరు నిడదవోలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలు చేశాడు. వెండి సింహాల కేసు కొలిక్కిరావడంతో పోలీసులు ఊరిపీల్చుకున్నారు.