YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు దేశీయం

పీపీఈ కిట్ వేసుకొని దొంగతనం

పీపీఈ కిట్ వేసుకొని దొంగతనం

పీపీఈ కిట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. కరోనా మహమ్మారి విజృంభణతో ప్రస్తుతం వీటి వాడకం బాగా పెరిగింది. కరోనా రోగులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా వీటిని ధరిస్తున్నారు. వైరస్ నుంచి రక్షణ కోసం ప్రయాణాల్లో వీటిని వాడుతున్నారు. కానీ, ఢిల్లీలో ఓ వ్యక్తి మాత్రం పీపీఈ కిట్‌ను వినూత్నంగా వినియోగించాడు. పీపీఈ కిట్ ధరించి ఓ ప్రముఖ నగల షో రూమ్‌లో భారీ దొంగతనం చేశాడు.స్టోర్ ముందు ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నా.. పీపీఈ కిట్‌లో సదరు వ్యక్తి తన పని ముగించాడు. 13 కోట్ల రూపాయల విలువైన 25 కేజీల బంగారు ఆభరణాలను దోచుకొని ఆటోలో పరారయ్యాడు. ట్విస్ట్ ఏమిటంటే.. పీపీఈ కిట్ ధరించినప్పటికీ పోలీసులు అతడిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు.


నిందితుడిని కర్ణాటకలోని హుబ్లీకి చెందిన మహ్మద్‌ షేక్‌ నూర్‌‌గా పోలీసులు గుర్తించాడు. అతడు దక్షిణ ఢిల్లీ కల్క్‌జీలోని ఓ ఎలక్ట్రికల్‌ షాపులో పని చేస్తున్నాడు. అతడు పని చేసే షాపుకు ఎదురుగానే బంగారు నగల షో రూం ఉంది. రోజూ ఆ షో రూమ్‌ను చూస్తూ.. దొంగతనం చేయాలనే దురాలోచన చేశాడు.  అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో తన ప్రణాళిక అమలు చేశాడు.నగల షో రూమ్ భవనాన్ని బాగా గమనించిన నిందితుడు.. భవనం ముందు గట్టి బందోబస్తు ఉండటంతో పక్క బిల్డింగ్ టెర్రస్ పైనుంచి దాని మీదకు దూకాడు. అనంతరం షో రూమ్ లోపల ప్రవేశించాడు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి అంతకుముందే పీపీఈ కిట్ ధరించాడు. షో రూమ్ మొత్తం కలియతిరుగుతూ బంగారు ఆభరణాలను తన బ్యాగ్‌లో సర్దుకున్నాడు. ఆ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.దుకాణం లోపలికి నిందితుడు నూర్‌ ఒక డెస్క్‌ మీద నుంచి అవతలి వైపుకు దూకుతున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దొరికిన కాడికి తీసుకుని వచ్చిన మార్గానే షాపు నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత ఆటోలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు. అతడు షో రూమ్‌కు అతి సమీపంలోనే నివాసం ఉంటుండంతో తేలిగ్గా పని పూర్తి చేశాడు. కానీ, పోలీసుల ముందు తన పప్పులు ఉడకలేదు పాపం..!

Related Posts