ఇండియా విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును అందుకుంది. ఇది ఏకంగా 187.3 గిగావాట్లకు చేరింది. గతంలో ఉన్న 185.82 గిగావాట్ల (జనవరి 20న) రికార్డును ఇది తుడిచిపెట్టేసింది. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుంటోంది అనడానికి దీనిని ఒక సంకేతంగా చెబుతున్నారు. ఈ మధ్యే ఆర్బీఐ కూడా తన జనవరి బులెటిన్‌లో రికవరీ ఫీనిక్స్‌లాగా ఉన్నదని చెప్పిన విషయం తెలిసిందే.2019లో ఇండియా విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా 168.74 గిగావాట్లుగానే ఉంది. శుక్రవారం ఉదయం 10.28 గంటల సమయంలో ఇండియా విద్యుత్ డిమాండ్ 1,87,300 మెగావాట్లకు చేరిందని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనమని కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 373.43 గిగావాట్లుగా ఉంది. ఇక మొత్తం డిమాండ్‌లో పరిశ్రమల వాటా 41.16 శాతం కాగా, వ్యవసాయం వాటా 17.69 శాతంగా ఉంది. వాణిజ్య విద్యుత్ వినియోగం వాటా 8.24 శాతంగా ఉంది. . ఇంధన వినియోగాన్ని ఆర్థిక వ్యవస్థలో ఉన్న డిమాండ్‌కు ముడిపెడతారు.