విజయవాడ, జనవరి 23,
మంత్రి కొడాలి నాని ప్రత్యర్థులపై విరుచుకుపడితే పవర్‌ఫుల్ డైలాగ్‌లు పేలతాయ్. లేటెస్ట్ ఎపిసోడ్‌లో అదే జరిగిందట. దీంతో మంత్రి వైఖరిపై వైసీపీ వర్గాల్లో చర్చ మొదలైందట. దూకుడుగా మంత్రి చేసిన వ్యాఖ్యలను టీడీపీ మాజీ మంత్రి చక్కగా వినియోగించుకున్నారట..దీనిపై ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.మంత్రి కొడాలి నాని..మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉంది. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య పడేది కాదు. ఇప్పుడు చెరో పార్టీలో ఉండటంతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల గొల్లపూడి ఎపిసోడ్‌తో ఈ గొడవ మరింత ముదురి పాకాన పడింది. దేవినేని ఉమా ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఒక్కసారిగా రాజకీయం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. నాని దూకుడుగా చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి.ఇదే అంశాన్ని కొనసాగిస్తూ మరుసటిరోజు దీక్షకు దిగారు మాజీ మంత్రి. దీంతో రెండు రోజులపాటు ఉమాపై మీడియా అటెన్షన్ పడింది. వాస్తవానికి గొల్లపూడి కార్యక్రమానికి టీడీపీ నేతలు హైప్ తీసుకురాలేకపోయారనే అభిప్రాయం వైసీపీలోనే ఉంది. వాస్తవానికి టీడీపీనేతల్లో కూడా దీక్ష పై పెద్దగా వ్యూహాలు.. ఎత్తుగడలు లేవట. కాకపోతే సీఎం జగన్‌ను తిడితే ఇంటికొచ్చి కొడతానన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలే ఈ స్థాయిలో రచ్చకు దారితీసిందని అనుకుంటున్నారు. దేవినేని ఉమాను ముందే హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత హంగామా జరిగేది కాదనే టాక్ కూడా నడుస్తోంది.ఇక గొల్లపూడి ఎపిసోడ్‌లో మరో అంశం కూడా వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఆ ప్రాంతానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రావడంతో ఇంకాస్త వేడి పెరిగింది. వైసీపీ నేతలు అక్కడికి వెళ్లకుండా ఉండి ఉంటే ఉమా చేపట్టిన కార్యక్రమానికి అంతా ప్రచారం వచ్చేది కాదని అధికారపార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.ఇప్పటికే వైసీపీలో కొంతమంది మంత్రి నాని వెనక పెదవి విరవటం ప్రారంభించారట. అనవసరంగా మాట్లాడటం ఎందుకు? చేతులారా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వడం ఎందుకు అని చర్చించుకుంటున్నారట.