న్యూఢిల్లీ, జనవరి 23,
బీజేపీ రాజకీయాలనాలా లేక జగన్ వ్యూహాలుగా చెప్పాలా అన్నది ఇదమిద్దంగా తేల్చలేము కానీ హస్తినలో ఏదో మతలబు అయితే జరుగుతోంది. ఇప్పటికి వరసపెట్టి నాలుగు నెలలుగా జగన్ ఆల్ ఆఫ్ సడెన్ గా ఢిల్లీ టూర్లు పెట్టుకుని వెళ్ళి వస్తున్నారు. జగన్ కలిసేది కూడా ఏ ప్రధానినో కాదు, మరే ఇతర కేంద్ర మంత్రులనో అంత కంటే కాదు, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి అతి కీలకమైన అమిత్ షాను. పేరుకు మోడీ ప్రధానిగా ఉన్నా మొత్తానికి మొత్తం చక్రం తిప్పేది అమిత్ షా అన్నది అందరికీ తెలిసిందే. అనూహ్యంగా అమిత్ షా తో జగన్ కి జిగినీ దోస్తీ కుదిరిపోయింది అంటున్నారు.ఏపీలో చూస్తే సీన్ మొత్తం రివర్స్ లో ఉంటోంది. జగన్ మీద అతి పెద్ద యుధ్ధమే బీజేపీ చేస్తోంది. వైసీపీ కూసాలు కదిలిపోయేలా మతం కార్డుని కూడా ముందుకు తెచ్చి మరీ దూకుడు పెంచుతోంది. జగన్ మీద క్రిస్టియన్ ముద్ర వేసింది అంటే బీజేపీ రాజకీయాన్ని ఏపీలో తక్కువ చేసి చూడగలమా. మరి బస్తీ మే సవాల్ అంటూ బీజేపీ ఇక్కడ తొడ కొడుతూంటే అక్కడ ఢిల్లీలో మాత్రం ఏకంగా కీలక నేతలతోనే జగన్ గంటల తరబడి భేటీలు వేస్తున్నారు. ఈ రెండింటికీ ఎక్కడా పొంతన లేకపోయినా రాజకీయమంటే ఇదే అన్నట్లుగానే సీన్ కనిపిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో చంద్రబాబుని దగ్గరకు చేర్చుకునేందుకు బీజేపీ కేంద్ర పెద్దలు సిధ్దంగా లేరు. బీజేపీ మొత్తానికి మొత్తం బాబు కావాలని అడిగినా మోడీ, అమిత్ షా మాత్రం నో అనే చెబుతారు. అందుకే ఆ ఇద్దరితోనే జగన్ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. బహుశా బీజేపీతో జగన్ సులువుగా కలిసిపోవడానికి కామన్ ఫ్యాక్టర్ చంద్రబాబే అనుకోవాలి. తాను కనుక దూరం పెడితే బాబు వచ్చి చేరుతారు అన్న బెంగా బెదురూ జగన్ కి కూడా ఉన్నాయి. అందుకే ఆయన బీజేపీ పెద్దలతో తరచూ మంతనాలు చేస్తూ వారికి అండ దండగా ఉంటున్నారు. ఇలా ఇద్దరి అవసరాలూ ఉండడంతోనే ఏపీలో బీజేపీ నేతలు ఎంత రచ్చ చేస్తున్నా జగన్ అసలు ఖాతరు చేయడంలేదు అంటున్నారు.మరి ఈ బంధం ఎన్నాళ్ళు సాగుతుంది అంటే ఏపీలో బీజేపీ నంబర్ త్రీ నుంచి నంబర్ టూ కి వచ్చేంతవరకూ అని చెప్పాలి. అది ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా ఈ స్నేహ బంధం తెగిపోతుంది. జగన్ ఆలోచనల్లో చూసుకుంటే ప్రస్తుతానికి బీజేపీ పోటీ అంతా టీడీపీతోనే. అది తనకు కూడా మంచిదేనని లెక్క వేసుకుంటున్నారు. అందుకే బీజేపీ ఎదిగేందుకు కాస్తా స్కోప్ ఇచ్చేలాగానే చూస్తున్నారు అంటున్నారు. మరో వైపు జగన్ తమ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాడు అని కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచన. బాబుతో పోలిస్తే జగన్ ని నమ్మవచ్చు అన్నదే వారి భావన. రేపటి రోజున జమిలి ఎన్నికలు జరిగి మెజారిటీ రాకపోతే అపుడు జగన్ సాయం కచ్చితంగా తమకు కావాలి కాబట్టి వారి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మొత్తానికి ఈ భేటీల వల్ల ఏపీ ప్రయోజనాలు ఎంత మేరకు నెరవేరుతాయన్నది ఎవరూ చెప్పలేరు కానీ పరస్పర రాజకీయ ప్రయోజనాలు మాత్రం తీరుతాయి అని చెప్పాలి