YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజ్యంగ సంక్షోభం దిశగా ఏపీ

రాజ్యంగ సంక్షోభం దిశగా ఏపీ

విజయవాడ, జనవరి 23 
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగసంక్షోభ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం.. అధికారులు సహకరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎస్‌ఈసీ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. శనివారం ఉదయం పది గంటలకు ఆయన మొదటి పంచాయతీలకు నోటిఫికేషన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అన్నదానితో ఆయన లెక్కలు చూసుకోవడం లేదు. ఆయన పని ఆయన చేసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే మదటి విడతలో ఏ ఏ పంచాయతీలకు ఎన్నికలకు పెట్టారో ఖరారు చేశారు. అయితే ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేయకుండా నిలువరించేందుకు ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది. హైకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో తప్పులు ఉండటంతో రిజిస్ట్రి వెనక్కిపంపారు. దీంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి తోడు ఉద్యోగ సంఘాలు కూడా సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు వాటిని స్వీకరించడానికి నిరాకరించింది. మామూలు పిటిషన్లుగా సోమవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సమాచారంతోనే.. ఎన్నికల నోటిఫికేషన్ ఆపడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడేవరకూ.. నోటిఫికేషన్ విడుదల చేయవద్దని ఎస్‌ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఎస్‌ఈసీ మాత్రం ఇప్పటికే చాలా దూరం వెళ్లిపోయారు. మొదటి సారి ఎన్నికలు వాయిదా పడినప్పుడు.. ఆయన బదిలీ చేయమన్న అధికారుల్ని తక్షణం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని మరోసారి డీజీపీ, సీఎస్‌కు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్‌ఈసీ ఆదేశాలను ఇరవై నాలుగుగంటల్లో అమలుచేయాల్సి ఉంటుంది. లేకపోతే.. రాజ్యాంగ ధిక్కరణ అవుతుంది. దీంతో అధికారులు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించకూడదనుకుంటోంది. ఈ రెండింటి మధ్య ఉన్నతాధికారులు.. ఉద్యోగులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న సూచనలకు అనుగుణంగా గవర్నర్ వద్దకు.. కోర్టులకు.. మీడియా ముందుకు ఉద్యోగ సంఘాలనేతలు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తే.. ఎక్కడ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని ఉన్నతాధికారులు నలిగిపోతున్నారు. ఎన్నికల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకోపవడంతో.. పరిస్థితి తెగేదాకా లాగుతున్నారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.

Related Posts