విజయవాడ జనవరి 23
డాక్టర్ అంబేద్కర్ మానసపుత్రిక రాజ్యాంగం. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమీషన్ రాజ్యాంగ విధి. హైకోర్టు తీర్పుతో ఎన్నికల సందిగ్ధతకు తెర పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం అయన పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. 68 డివిజన్లలో నాలుగు విడతలుగా 659 మండలాల్లో పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత లెక్కింపు, ఫలితాలను విడుదల చేయనున్నారు. నిమ్మగడ్డ మాట్లాడుతూ న్యాయస్థానంలో సహేతుకంగా ఎన్నికల సంఘం వాదనలు వినిపించింది. ఎన్నికల కమీషన్ పై న్యాయవ్యవస్థ పై విశ్వాసం, విధేయత, వినయం ఎప్పుడూ ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ కు అనుసంధానంగానే విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా జిల్లాలలో మొదటి విడత ఎన్నికలు జరుగుతాయని అన్నారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ సీఎస్, పంచాయితీరాజ్ కమీషనర్, పంచాయితీరాజ్ ప్రధాన కార్యదర్శి తప్పక సమావేశానికి రావాలి. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మరింత మెరుగైన పనితీరు కనపరచాల్సి ఉంది. అపరిష్కృతంగా కొన్ని సమస్యలు వదిలేయడం విచారకరమని అయన అన్నారు. పంచాయితీరాజ్ కమిషనర్, సెక్రెటరీ పూర్తిగా విఫలం అయ్యారు. 2021 ఎన్నికల రోల్ ఆధారంగానే ఎన్నికలు జరపాలన్నా.. ఎన్నికల రోల్స్ పూర్తి చేయలేకపోయాం. 2019 ఎన్నికల రోల్ ప్రకారమే విధిలేని పరిస్ధితులలో ఎన్నికలు నిర్వహిస్తాం. పంచాయితీరాజ్ అధికారుల అలసత్వం వల్ల 18 సంవత్సరాలు దాటిన 3.6 లక్షల మంది యువకులు ఓటుహక్కు కోల్పోతారు. పంచాయితీరాజ్ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం పై తగిన చర్యలు తీసుకోబడతాయని అయన అన్నారు. సుప్రీంకోర్టు లో వాయిదా వస్తుందని, ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వం ఆలోచన సహేతుకంగా లేదు. ఎన్నికల కమీషన్ కు, ప్రభుత్వానికి మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ముందుగా బయటకు వచ్చేసాయి. ఆర్టీఐ యాక్టు ప్రకారం కొన్ని సడలింపులు కమీషన్ కు ఉన్నాయి. సామాజిక సెవా ధృక్పధంతో చాలామంది ఎన్నికలలో పోటీ చేస్తారు. ఎవరైనా ఎన్నికలకు అవరోధం కల్పిస్తే.. వారిపై పోలీసు శాఖతో చర్యలుంటాయి. గత రెండున్నర సంవత్సరాలుగా అధికారుల నియంత్రణలో పంచాయితీలు ఉన్నాయి. సమాజంలో బడుగు, బలహీనవర్గాలు, మహిళల అస్థిత్వం ఎన్నికలపై ఆధారపడి ఉంది. నిధులు కూడా ఎన్నికలు నిర్వహించడంతోనే వస్తాయి. ఒక ఐజీ స్ధాయి అధికారితో ఎన్నికలలో వచ్చే సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రభుత్వం లాగే ఎలక్షన్ కమీషన్ కు కూడా ఇబ్బందులు ఉన్నాయి. గవర్నర్ ను ఎన్నికలు జరిగేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అడిగాం. 243 కే రాజ్యాంగ అధికరణం ద్వారా గవర్నర్ కు విశేష అధికారాలు ఉంటాయి. మా వద్ద సిబ్బంది లేమి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరుతాం. ఉద్యోగ సంఘాలు కోరుతున్నది సరైనది కాదు. చాలా రాష్ట్రాలలో ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఆదేశాల మేరకు, ఉద్యోగులతో నిర్వహించాలి. ఎన్నికలకు ఉద్దేశ పూర్వకంగా విఘాతం కలిగిస్తే, ఎటువంటి పరిణామాలైనా ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. 2021లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు చారిత్రాత్మకం. ఎన్నికలలో పాల్గొనాలి అనే ఆకాంక్ష ప్రజలలో ఉంది. ప్రజల ఉత్సుకతను, ఆకాంక్షను గౌరవించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అందరం సంయమనంతో, విజ్ఞానంతో పనిచేయాలి. పరిస్థితుల ను గవర్నర్ వద్దకు, అవసరమైతే న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకు వెళ్ళడానికి వెనుకాడను. గవర్నర్, , జిల్లా కలెక్టర్ల సహకారం కూడా ఉందని అయన అన్నారు.