న్యూఢిల్లీ జనవరి 23
సరిహద్దుల నుంచి చైనా తమ దళాలను ఉపసంహరించనంత వరకు తాము కూడా దళాలను వెనక్కి పంపించమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లడాఖ్ సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. సరిహద్దుల్లో భారత్ తన మౌళికసదుపాయాలను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. అయితే చైనా కొన్ని ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. దళాల సంఖ్యను తగ్గించబోమని, చైనా ఆ ప్రక్రియ మొదలుపెట్టనంత వరకు తాము కూడా దళాలను తగ్గించమని మంత్రి వెల్లడించారు. చైనాతో జరుగుతున్న చర్చలకు డెడ్‌లైన్ లేదన్నారు. ఆ సమస్యకు తేదీని ఖరారు చేయలేమన్నారు. చర్చలతో సమస్య పరిష్కృతమవుతుందన్న నమ్మకం ఉందన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్నట్లు వస్తున్న వార్తలపైన కూడా మంత్రి స్పందించారు. ఆ నిర్మాణం చాలా ఏళ్ల నుంచి సాగుతున్నట్లు మంత్రి చెప్పారు.