అమరావతి జనవరి 23
ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీకి ఎస్ఈసీ సిద్ధమవుతుండగా కీలక పరిణామం చోటుచేసుకుంది.ఏపీ ఎన్నికల సంఘం.. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా సరే ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి సై అన్నది. దీంతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉద్యోగులు సమరశంఖం పూరించడం హాట్ టాపిక్ గా మారింది.ప్రభుత్వం సిద్ధంగా లేని స్థానిక సంస్థల ఎన్నికలను తాము మాత్రం ఎందుకు నిర్వహించాలని ఏపీ ఉద్యోగులు భీష్మించారు.ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయని తెలిసి కూడా ధిక్కారానికి సిద్ధమైపోతున్నారు. సాక్ష్యాత్తూ అఖిల భారత సర్వీసు అధికారులు సైతం నిమ్మగడ్డను ధిక్కరిస్తూ జగన్ సర్కార్ పక్షాన నిలవడం సంచలనమవుతోంది.ఉద్యోగులు సహకరించని చోట్ల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఇది చాలా పెద్ద ఉపద్రవం అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తో ఉద్యోగ సంఘాల ఐకాస భేటి అయ్యింది. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ కు వినతిపత్రం అందజేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాల్గొనలేమని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెవెన్యూ పోలీస్ పంచాయితీరాజ్ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాల నేతలు సీఎస్ ను కలిసి 9 పేజీల వినతిపత్రాన్ని తాజాగా అందజేశారు. టీకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని.. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ విధుల్లో పాల్గొంటున్నామని.. కేవలం టీకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే ఎన్నికల వాయిదా కోరుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఇప్పటికే నిమ్మగడ్డ కోరిన విధంగా ఓటర్ల జాబితా ఇవ్వడం కానీ.. నిధుల విడుదల కానీ.. క్షేత్రస్థాయిలో ఇతరత్రా సహకారం అందించేందుకు ఉద్యోగులు నిరాకరించారు. నిమ్మగడ్డ బదిలీ చేయాలని కోరిన ఐఏఎస్ లు ఐపీఎస్ లను సైతం ప్రభుత్వం బదిలీ చేయలేదు. ఏకంగా సీఎస్ పదవిలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సైతం నిమ్మగడ్డ ఆదేశాలను లెక్కచేసే పరిస్థితుల్లో లేరు. రేపు నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అధికారులు చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది.