‘‘సంకల్ప వికల్పాత్మకం మనః’’
..అని, శాస్త్రవచనం. ప్రతి క్షణం మన మదిలో కదలాడే సంకల్ప వికల్పాల సమూహమే మనసు. అదే మనిషి ఆధ్యాత్మిక సాధనకు అడ్డుగా నిలిచే ప్రధాన శత్రువు. చంచలత్వమే దాని తత్వం. ఆ విషయాన్ని ఎరిగి దాన్ని నియంత్రణలో ఉంచుకొనే ప్రయత్నం చేయాలి. మనసు ఒక ఆలోచనపై స్థిరంగా ఉండదు. అయినది, కానిది, తనకు సంబంధించినది, సంబంధం లేనిది.. ఇలా అన్ని విషయాలపైనా తిరుగుతుంటుంది. అక్కరకు రాని ఆలోచనలు చేస్తుంటుంది. అందుకే దీన్ని కోతితో పోలుస్తారు. కోతి ఒక కొమ్మపై స్థిరంగా కూర్చోదు. ఈ కొమ్మ పై నుంచి ఆ కొమ్మపైకి, అక్కడ నుంచి మరో కొమ్మపైకి గెంతుతుంటుంది. కారణం లేకున్నా ఒక కొమ్మో, రెమ్మో పట్టుకొని క్రిందికి వేళ్లాడుతుంటుంది. అది కూడా క్షణం పాటే! దాని మదిలో ఇంకేదో ఆలోచన రాగానే అటు దూకుతుంది. తాను తినేది పండిన కాయలే అయినా.. అనవసరంగా పచ్చికాయలు కూడా కోసి, కాస్త కొరికి అవతల పడేస్తుంటుంది. అలాగే మనసు కూడా అవసరం లేని ఆలోచనలే ఎక్కువగా చేస్తుంటుంది. మనసును నియంత్రించుకొనే ప్రయత్నం చేయడం ఆధ్యాత్మిక సాధకులకు చాలా అవసరం. లేకుంటే మాయ ప్రభావానికి దూరంగా జరగలేరు. భగవంతునకు చేరువగా వెళ్లలేరు. అందుకు ఏం చేయాలంటే.. ముందుగా మనసుకు గల ఒక ప్రధాన దోషాన్ని తొలగించుకొనే ప్రయత్నం చేయాలి. ఏమిటా దోషం? తన గురించి అంతా మంచిగా భావించుకోవటం, పరుల దోషాలను వెతికి వెతికిపట్టుకొని, పనిగట్టుకొని యితరులతో వాటిని గురించి మాట్లాడటం. పరుల దోషాలను వెదకటం పాపమనే విషయాన్ని మనం గట్టిగా విశ్వసించాలి. ఆ దోషానికి పాల్పడి పాపాన్ని మూటగట్టుకొని జీవితాన్ని నిరర్థకం గావించుకోకూడదు. మన మాటలతో ఎవరినీ నొప్పించకూడదు. బాధపడేట్లు చేయకూడదు. ఈ సందర్భంలో మహాభారతంలో గల ఒక ప్రబోధను జ్ఞాపకం చేసుకోవచ్చు.
ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబున కగు దా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథములకెల్లన్
ఇతరులు మనకు ఏమిచేస్తే మన మనసు బాధపడుతుందో ఇతరులకు మనం అలా చేయకుండా ఉండడమే పరమ ధర్మంగా భావించి నడుచుకోవాలని దీని తాత్పర్యం. ఈ సందేశాన్ని సదా జ్ఞాపకం ఉంచుకుంటే మాటలతో గాని, చేతలతో గాని యితరుల మనసును బాధపెట్టం. అప్పుడు మాత్రమే సత్కార్యాలు చేస్తూ, సదాలోచనలు సల్పుతూ పరమాత్మను స్మరిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రులం కాగల్గుతాం. మనం స్థిరంగా సంకల్పించుకోవాలే గానీ ఇది మనం అనుసరించలేని మార్గం కాదు. వేదాధ్యయనం, జపతపాల ఫలితం కన్నా మనో నియంత్రణా ఫలితమే కడు గొప్పది. మనో మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోకుండా ఎట్టి ఆధ్యాత్మిక సాధనలు చేసినా ప్రయోజనం శూన్యం.
- మాదిరాజు రామచంద్రరావు,