అమరావతి జనవరి 23
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల గురించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మాట్లాడారు. నాలుగు విడతల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయని ఆయన తెలిపారు. గతంలో అనుకున్న మాదిరిగానే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా పంచాయతీరాజ్ శాఖ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ బాధ్యతారాహిత్యం వల్ల 3.6 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారు అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ద్వారా వారికి సంక్రమించిన హక్కును కోల్పోతున్నాని తెలిపారు. పంచాయతీరాజ్శాఖ చర్యలతో ఈ పరిస్ధితి వచ్చిందన్నారు. సరైన సమయంలో పంచాయతీ రాజ్ కమిషనర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో సమస్యలున్నా ఏదో రకంగా ఎన్నికలు జరపాలని కమిషన్ నిర్ణయించిందన్నారు. దానికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతాం అని అన్నారు. 2021 ఎన్నికల రూల్ ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలనుకున్నాం. కానీ ఓటర్ల జాబితా తయారుచేయడంలో పంచాయతీరాజ్ శాఖ పూర్తిగా విఫలమైంది. అందుకే 2019 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల సంఘానికి సిబ్బంది కొరత ఉంది. కోర్టుకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని 2021 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరుపుతామని హైకోర్టుకు హామీ ఇచ్చినా సాధ్యం కాలేదని. కాబట్టి 2019 ఓటర్ల జాబితా ఆధారంగానే విధిలేని పరిస్ధితుల్లో ఎన్నికలు జరపాల్సి వస్తోందన్నారు.ఎన్నికల వాయిదా కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నికలు వాయిదా వేయాలని తీర్పు ఇస్తే ఆ తీర్పును అనుసరించి ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.తొలి విడుత ఎన్నికలకు జనవరి 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం. జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు. జనవరి 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటాం. జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించాం. ఫిబ్రవరి 5 తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తాం. అదేరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తాం అని అన్నారు.