తిరుపతి, జనవరి 25, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని ఆ పదవి నుంచి జగన్ తప్పిస్తారా? లేదా? ఇదే ఇప్పుడు పార్టీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. టీటీడీ ఛైర్మన్ పదవీకాలం పూర్తి కావస్తుండటంతో తర్వాత ఛైర్మన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి 2019 జూన్ 22 న బాధ్యతలను చేపట్టారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. అంటే మరో ఐదు నెలలు మాత్రమే గడువు ఉంది.గతంలో టీటీడీ ఛైర్మన్ పదివి ఏడాదికాలం మాత్రమే ఉండేది. కానీ చంద్రబాబు హయాంలో దానిని ఏడాదినుంచి రెండేళ్లకు పెంచారు. 2021 వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో జగన్ ఆయనను మరోసారి కంటిన్యూ చేస్తారా? లేదా మరొకరికి పదవిని కట్టబెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. జమిలి ఎన్నికలు వస్తుండటంతో వైవీ సుబ్బారెడ్డి సేవలను పార్టీకి జగన్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి చూస్తున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే పార్టీ పరంగా వైవీ సుబ్బారెడ్డి సేవలు అవసరమని జగన్ భావిస్తున్నారు. అలా అయితే ఆయనను తప్పించి వేరే వారికి టీటీడీ ఛైర్మన్ పదవిని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. టీటీడీ ఛైైర్మన్ పదవి కోసం అనేకమంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో మంత్రి పదవి దక్కని ఎమ్మెల్యేలకు టీటీడీ ఛైర్మన్ పదవిని జగన్ ఇస్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అలా కాకుండా వైవీ సుబ్బారెడ్డినే జగన్ కంటిన్యూ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇటీవల కాలంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో టీటీడీ వంటి అతి పెద్ద సంస్థను వేరే వారికి జగన్ కట్టబెట్టరని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో ఇప్పటి నుంచే కొందరు ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. చూడాలి మరి వైవీ విషయంలో జగన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో?