కడప, జనవరి 25, రాయలసీమ ఉద్యమంతో సాధించుకున్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో ఆర్టీపీపీలో ఉద్దేశ్యపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించి నష్టాలు చూపిస్తూ ప్రైవేట్ కంపెనీలకు అమ్మజూపారు. ఆ ప్రయత్నం సఫలం కాకముందే , చంద్రబాబు అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జిల్లావాసి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో ఆర్టీపీపీ కొత్త యూనిట్ల స్థాపనతో ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఆర్టీపీపీని ఎన్టీపీసీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో నడుస్తున్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నష్టాల ఊబిలో ఉందని అధికారుల నివేదికలు తేల్చాయి. ఎర్రగుంట్ల ప్రాంతంలో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తిచేసే కేంద్రంగా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రస్తుతం రూ.7వేల కోట్లు పైబడి అప్పులతో కొట్టుమిట్టాడుతోందని ఏపీ జెన్కో అధికారులు లెక్కతేల్చారు. ఆర్టీపీపీ నష్టాలతో నడుస్తుండటంతో ఎన్‌టీపీసీలో విలీనం చేయబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసి జీవో విడుదల చేయడమే తరువాయి. ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయరాదని కార్మికులు, ఉద్యోగులు గత 20 రోజులుగా నిరసనలు, ర్యాలీలు, ధర్మా చేస్తున్నారు. గతనెల జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసి ఆర్టీపీపీని ఎన్టీపీసీలోకి విలీనం చేయవద్దని కార్మికులు, ఉద్యోగులు విజ్ఞప్తి చేసేందుకు జిల్లాకలెక్టర్ అనుమతి తీసుకున్నప్పటికీ వీలు కాలేదు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి నేరుగా విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసి తమకు ఉద్యోగభద్రత కల్పించాలని, థర్మల్ పవర్ ప్రాజెక్టును ఎన్టీపీసీలోకి విలీనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి నుంచి కార్మికులు, ఉద్యోగులకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. ఎన్టీపీసీ గోబ్యాక్, డౌన్‌డౌన్ అంటూ ఉద్యోగులు, కార్మికులు గత 20 రోజులుగా చేస్తున్న ఆందోళనలు ఇప్పుడు అరణ్య రోదనగానే మారాయి. పూడ్చుకోలేని నష్టాలలో ఉన్నందున నష్టనివారణ చర్యలు తప్ప వేరే మార్గం లేదని ప్రభుత్వం భావించి ఎన్టీపీసీలో విలీనం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. విధివిధానాలు ఖరారుచేస్తూ జీవో వెలువరించడ మే ఆలస్యమని జెన్కో అధికారులు అంటున్నారు.రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో 4 వేల కోట్ల రూపాయలు బకాయిలుంటే ఒక్క ఆర్టీపీపీని మాత్రమే ఎన్టీపీసీలోకి ఎందుకు బదలాయిస్తున్నారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. కార్మికులు, ఉద్యోగులు దీనే్న ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు రాష్ట్ర సంస్థ అయినందున రాష్ట్ర, జిల్లాస్థాయి రిక్యూట్‌మెంట్ ద్వారా అనేకమంది కార్మికులుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఎన్టీపీసీ జాతీయ సంస్థ కావడంతో ఆ నిబంధనల ప్రకారం తమ ఉద్యోగాలు ఉండవేమోననే భయం కార్మికులను వెంటాడుతోంది. జాతీయస్థాయిలో నోటిఫికేషన్ ద్వారా రాతపరీక్ష రాసి ఆర్టీపీపీలో ఉద్యోగాలు పొందిన వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది వుండకపోవచ్చు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు బేసిక్ కింద పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎన్టీపీసీలోకి విలీనం చేస్తే అనేకమందిని, ఇతర రాష్ట్రాల్లోని ఎన్‌టీపీసీ ప్రాజెక్టులకు బదిలీ చేస్తారనే భయం కూడా ఉద్యోగులను వెంటాడుతోంది.ఆర్టీపీపీ 1650 మెగావాట్ల సామర్థ్యం కలిగివుంది. పూర్తిస్థాయిలో నడవాలంటే ఆర్టీపీపీకి రోజుకు 22 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు, 40 క్యూసెక్కుల నీరు అవసరం. ఇక్కడ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఎర్రగుంట్ల సమీపంలోని ఆర్టీపీపీకి దిగుమతి చేసుకోవాల్సివుంది. బొగ్గు రవాణా, కొనుగోలు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవుతున్న బొగ్గు ఖర్చు ఆర్టీపీపీని నష్టాలలోకి తోస్తోందని అధికారులు అంటున్నారు. యూనిట్ ఉత్పత్త్ధిర రూ.6.50 పడుతోందని అధికారులు అంటున్నారు. అధికారపార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందిగా ఉందని ఏపీ జెన్కో అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం కంటే నష్టమే ఎక్కువగా వాటిళ్లడంతో ఆర్టీపీపీని ఎన్టీపీసీలోకి బదాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎన్‌టీపీసీలో పూర్తిగా విలీనం చేయాలా లేక 50 శాతం వాటా ఇవ్వాలా అనే ఆలోచనలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.