గుంటూరు, జనవరి 25, కొద్దిరోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వార్తలకు, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజధాని అమరావతికి దగ్గర లో ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే సైలెంట్ అయ్యారు. కరకట్ట మీద కూల్చివేతల సమయంలో ఒకింత దూకుడు ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత నుంచి మౌనంగానే ఉంటూ వస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఆయన మాత్రం స్పందించడం లేదు.వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిత్యం వార్తల్లో ఉండేవారు. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ప్రతి అంశంలోనూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అప్పటి అధికార పార్టీని ఇబ్బందుల్లో పడేసేవారు. కోర్టు పక్షిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి రైతుల విషయంలోనూ, సదావర్తి భూముల విషయంలో ఆయన అప్పటి ప్రభుత్వానికి కంట్లో నలుసుగా తయారయ్యారు.ఇప్పుడు కూడా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు పై ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొద్ది నెలలుగా మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణే అని అంటున్నారు. లేనిపోని వివాదాలు తెచ్చుకోకుండా ఉండటం మేలని భావించారు. ఆయన అనుచరులకు కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. విపక్షానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని ఆళ్ల రామకృష్ణారెడ్డి గట్టిగా చెప్పినట్లు తెలిసింది.మరి కొద్దినెలల్లో వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నారు. ఈసారి ఖచ్చితంగా తనకు మంత్రిపదవి దక్కుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు. ఎలాంటి నామినేటెడ్ పదవులను ఆయన కోరుకోవడం లేదు. గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఉన్నారు. ఈ నేపథ్యంలో విస్తరణలో ఇద్దరికి చోటు దక్కే అవకాశముంది. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి వివాదాలకు దూరంగా ఉంటూ హైలెట్ కాకూడదన్న కారణంగానే మౌనంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.