విజయవాడ, జనవరి 25, సాదినేని యామిని. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువనాయకురాలు. ఫైర్ బ్రాండ్‌గా రాజకీయ సంచలనాలకు వేదికగా నిలిచిన ఆమె.. ఇప్పుడు రాజకీయంగా కుదురుకునేందుకు నానా ప్రయాసపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఎంత దూకుడుగా రాజకీయాలు చేశారో.. అంతే సైలెంట్‌గా ఇప్పుడు తెరమరుగయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీ హయాంలో ఆ పార్టీలో ఉన్న సాదినేని యామిని చంద్రబాబు తరఫున పార్టీ తరఫున బలమైన గళం వినిపించారు. టీవీ చర్చల్లోనూ పాల్గొన్నారు. పార్టీలో పెద్ద పెద్ద పదవులు దక్కకపోయినా.. ఆమె పార్టీ తరఫున మాత్రం వాయిస్ వినిపించారు.అయితే పార్టీ తరఫున జరిగిన చర్చల్లో సాదినేని యామిని చేసిన కామెంట్లపై అనేక వివాదాలు వచ్చాయి. అదే సమయంలో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలోనూ కామెంట్లు కురిశాయి. ఆ సమయంలో అండగా ఉంటుందని భావించిన పార్టీ సాదినేని యామినిని ఒంటరిని చేసింది. పైపైకి కేసులు పెట్టినా.. సాదినేనిని మానసికంగా వేదించిన వారిపై మాత్రం అధికారంలో ఉండి కూడా టీడీపీ తరఫున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఒకింత మనస్థాపానికి గురైన సాదినేని యామిని గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత.. ఆ పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. ఇక, బీజేపీ తరఫున కూడా అంతే దూకుడుగా కామెంట్లు చేశారు.అయితే ఆమె ఆశించిన గుర్తింపు అటు టీడీపీలోను, ఇటు బీజేపీలోను కూడా సాదినేని యామినికి లభించలేదు. పైగా..బీజేపీలో ఉన్న నేపథ్యంలో సోము వీర్రాజు ఆదేశాల మేరకు ఆమె ఏ టీవీ చర్చల్లోనూ పార్టిసిపేట్ చేయడం లేదు. వాస్తవానికి వాయిస్ ఉన్న రాజకీయ మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. పోనీ.. ఉన్నవారినైనా వాడుకునేవారు కనిపించడం లేదు. దీంతో బీజేపీతోనూ ఆమె అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పేరుకు పార్టీలో ఉన్నా.. కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు. తనే స్వచ్ఛదంగా ఓ సంస్థను పెట్టుకుని దాని తరఫునే తన వాయిస్ వినిపిస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. సాదినేని యామిని రాజకీయాలను గమనిస్తున్నవారు.. ఆమెలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని.. అయితే.. రాజకీయంగా మాత్రం ఆమెను షాడో నేతలు తొక్కేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీలో ఉండగా.. బీసీ నాయకురాలు పంచుమర్తి అనురాధపై ఇలాంటి విమర్శలు అంతర్గతంగా వినిపించాయి. ఆమె ఎదగలేరు.. ఎవరినీ ఎదగనివ్వరనే కామెంట్లు పంచుమర్తి విషయంలోఅనేక సార్లు తెరమీదికి వచ్చాయి. ఇక, బీజేపీలోనూ సాదినేని యామినిని ఎవరో తొక్కి పెడుతున్నారనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. మరి యామిని రాజకీయాలుపుంజుకుంటాయో లేదో చూడాలి.