విజయవాడ, జనవరి 25,
నిజంగా ఒక పదవి ఎవరికైనా కట్టబెడితే రెండు ప్రయోజనాలను ఆశిస్తారు. ఒకటి పార్టీకి ఆ వ్యక్తి ఏ విధంగా ఉపయోగపడతారని. రెండు రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని. ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా ఈ రెండు విషయాలనే ఆలోచిస్తారు. చంద్రబాబు, జగన్ లు ఇందుకు భిన్నం కాదు. గత ఏడెనిమిది నెలలుగా తాను పదవిని దక్కించకున్న రాష్ట్రాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్రానికి వచ్చిందీ లేదు. ఆయనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని.పరిమళ్ నత్వాని మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఉత్తరాదిలో వ్యాపారవేత్తగా కొందరికి మాత్రమే సుపరిచితం. అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు. ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో ఆయన కన్ను ఏపీపైన పడింది. నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ముఖేష్ అంబానీని జగన్ వద్దకు పంపారు. జగన్ కు ఏ హామీ లభించిందో తెలియదు కానీ పరిమళ్ నత్వానికి రాజ్యసభ పదవి ఇచ్చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పరిమళ్ నత్వానికి పదవి ఇచ్చినట్లు అప్పట్లో అధికార పార్టీ నేతలు పదే పదే చెప్పారు.కానీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరిందో? లేదో? తెలియదు కాని రాష్ట్రానికి మాత్రం ఏ విధంగా ఆయన ఉపయోగపడలేదు. కనీసం కరోనా సమయంలోనూ ఆయన స్పందించలేదు. రాష్ట్రాన్ని ఆదుకోలేదు. నామినేషన్ వేయడానికి మాత్రమే రాష్ట్రానికి వచ్చారు. ఎన్నికైనట్లు అధికార పత్రాన్ని తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత పరిమళ్ నత్వానీ పత్తా లేకుండా పోయారు. ఆయనకు ఎందుకు పదవి ఇచ్చారన్న దానిపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది.పరిమళ్ నత్వానీకి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఇటు అంబానీ, అటు ఆయన పెద్దయెత్తున ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతారని జగన్ ఆశించారంటారు. ఇదే కొందరు వైసీపీ నేతలు కూడా బయటకు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ ఏపీలో అలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో పరిమళ్ నత్వానీని జగన్ ఎందుకు ఎంపిక చేశారన్న కామెంట్స్ పార్టీనుంచే వినపడుతుండటం విశేషం. ఉపయోగపడని వారికి పదవులు ఇచ్చి లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పరిమళ్ నత్వానీ పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా