YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాలుష్యం కమ్మేస్తోంది.. !!

కాలుష్యం కమ్మేస్తోంది.. !!
విజయవాడ నుంచి వెళుతున్న అన్ని కాలువల్లోనూ తాగునీరు కలుషితమవుతోంది. కనీసం శుద్ధి చేయని నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్లే మూడు ప్రధాన కాలువల కింద జిల్లాలో దాదాపు 383 చెరువులను నింపడం ద్వారా 500 గ్రామాలకు పైగా తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీటిని వినియోగించలేమని గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఒకవైపు విజయవాడలో కాలుష్యం నివారణకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై పచ్చదనం పెంచుతున్నారు. గాలిలో కాలుష్యం నివారణకు వాహనాలను నగరంలోనికి రానీయడం లేదు. కార్బన్‌ డైఆక్సైడ్‌ శాతాన్ని తగ్గిస్తున్నారు. వాతావరణ కాలుష్యం ఇలా తగ్గిస్తుంటే.. మరోవైపు జలకాలుష్యం తీవ్రంగా పెంచుతున్నారు. ఏ.కొండూరు మండలంలో జరిగిన సంఘటనలాంటివి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలవనరులు, నగరపాలక సంస్థ, పంచాయతీ అధికారులుగానీ, తాగునీటి సరఫరా శాఖ విభాగం అధికారులు గానీ కనీసం చర్యలు తీసుకోవడం లేదు. కృష్ణాజిల్లాలో ప్రకాశం బ్యారేజీ సాగునీటి కాలువల ద్వారా దాదాపు 7.36లక్షల ఎకరాలు సాగులో ఉంది. దాదాపు సగం జిల్లాకు ఈ కాలువల ద్వారానే మంచినీరు అందుతుంది. మొత్తం 383 చెరువులను నింపి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 500 ప్రధాన గ్రామాలకు చెరుల నీటిని వినియోగిస్తున్నారు. బందరు కాలువ కింద 1.51లక్షల ఎకరాలు సేద్యం అవుతుంది. అవనిగడ్డవైపు 1.37లక్షల ఎకరాలు సాగులో ఉంది. మొత్తం 60 చెరువులకు దీని ద్వారా నింపుతున్నారు. బందరు కాలువ గట్టు మొత్తం ఆక్రమణలకు గురైంది. కృష్ణలంక నుంచి తాడిగడప వరకు ఇరువైపులా గట్లు ఆక్రమించారు. నివాసాల నుంచి మురుగునీరు నేరుగా కాలువల్లోకి వదులుతున్నారు. బందరు కాలువల్లో నీరు ముదురు నీలివర్ణంతో కనిపిస్తోంది. గాఢత ఎక్కువగా ఉంటుంది. నాచుపట్టి కంపు కొడుతోంది. కానూరు పంచాయతీ పరిధిలో మురుగు కాలువలను నేరుగా బందరు కాలువలోకి వదులుతున్నారు. రైవస్‌ కాలువ, ఏలూరు కాలువల కింద 3.33లక్షల ఎకరాలు, 1.15 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. దీనికి తోడు వందలాది చెరువలను నింపడం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ప్రసాదంపాడు సమీపంలో మురుగునీరు కాలువలోకి వదలడంతో విపరీతమైన వాసనతో ఆప్రాంత వాసుల ముక్కు పుటలాలు అదిరిపోయాయి. దీంతో గ్రామస్థులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. అయినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. బుడమేరు నీటిని తాగిన పశువులు మృత్యువాత పడినట్లు పలుగ్రామాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవల నగరంలో ఆకస్మికంగా పర్యటించి కాలువ పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల సుందరీకీకరణ వెంటనే చేపట్టాలని సూచించారు. పలు కూడళ్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన తర్వాత కొన్ని ప్రాంతాల్లో హడావుడి చేశారు. కంచెలు వేశారు. మొక్కలు నాటారు. కానీ ఇలా మురుగునీటిని మాత్రం పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ కాలువగట్ల ఆక్రమణపై చర్చ జరిగింది. వారికి ప్రత్యామ్నాయ ఇళ్లు కేటాయించాలని ఉపముఖ్యమంత్రి కేఈకృష్ణమూర్తి సూచించారు. నగర పాలక సంస్థ అధికారులు గానీ జలవనరులశాఖ అధికారులు గానీ కాలవలపై పెట్రోలింగ్‌ నిర్వహించి మురుగునీటిని నివారించే పరిస్థితిమాత్రం కనిపించడంలేదు. పైగా బందరు కాలువలోకి బందరు రోడ్డు విస్తరణ పేరుతో మురుగునీటి కాలువల నిర్మాణం చేసి నేరుగా వదులుతున్నారు. వరదనీటి కాలువల పేరుతో వీటిని వదులుతున్నా.. అవి వదిలే నీరు మురుగు కావడం గమనార్హం. విజయవాడలో దాదాపు 550 టన్నుల చెత్త వెలువడుతుంటే ఇందులో కనీసం 20శాతం కాలువల్లో పడవేస్తున్నారు. కాలువలన్నీ ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో నిండి పోతున్నాయి. ఈ పరిస్థితిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుందని జనాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Related Posts