ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం, యధావిధిగా ఎన్నికలు జరపవచ్చని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఎన్నికల ప్రతి సారి వాయిదా పడుతున్నాయి. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగం. కరోనా ఉన్నప్పుడు ఎన్నికల కావాలన్నారు. ఈసీని తప్పు పడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు . ఎన్నికలను ఇలా వాయిద వేసుకుంటూ వెళ్లకూడదు. మీరు కమిషనర్ ని తప్పుబడుతూ మాట్లాడుతున్నారు, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఇద్దరి మధ్య ఈగో సమస్యలుంటే, లా లెస్ నెస్ ఏర్పడేలా చేయకూడదని జస్టిస్ కౌల్ అన్నారు. తాము ఎన్నికలకు వ్యతిరేకం కాదని, కేవలం వాయిదా కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. వారి వాదనలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషన్లను డిస్మిస్ చేసింది.