YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నీరు చెట్టు.. దారెటు..?

నీరు చెట్టు.. దారెటు..?
జిల్లాలో నీరు చెట్టు పనులు పడకేస్తున్నాయి. నీటిని ఒడిసి పట్టుకోకపోతే కన్నీటి కష్టాలు తప్పవు. అడుగంటిపోతున్న భూగర్భ జలమట్టాలు పెంచుకోవడం మానవాళికి అత్యంత అవసరం. వృథాగా పోతున్న వర్షపు నీటిని నిల్వ చేసుకోగలిగితేనే జలభద్రతకు భరోసా లభిస్తుంది. సక్రమంగా నీందితే సిరుల పంటలు పండించవచ్చు. దుర్భిక్షాన్ని తరిమికొట్టి కరవును జయించవచ్చు. అందుకే వాననీటిని భూమి పొరల్లోకి ఇంకించాలనే సదాశయంతో రాష్ట్ర ప్రభుత్వం ‘నీరు-చెట్టు’ను యజ్ఞంలా చేపట్టింది. క్షేత్రస్థాయిలో ప్రణాళిక లోపం, బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న అంతులేని జాప్యం కారణంగా ఈ కార్యక్రమం మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. ప్రగతి పడకేసి లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో 2017- 18 ఆర్థిక సంవత్సరంలో పూడికతీత, చెక్‌డ్యాం పనులు చేసేందుకు రూ.420.31 కోట్లకు ఆమోదం తెలిపారు. 3,140 చోట్ల ప్రారంభించారు. అందులో 2,049 పూర్తయ్యాయి. 1,048 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 1,350 అసలు మొదలుకాలేదు. 30 శాతం ఎలాంటి పురోగతి లేదు. ఇదేమని అడిగే దిక్కు లేదు. జిల్లాలో ‘నీరు-చెట్టు’ అమలుపై తరచూ సమీక్షలు, సమావేశాలు జరుగుతున్నా ఎక్కడా అనుమతిచ్చాము. అవి ఏ దశలో ఉన్నాయని ఆరాతీసే అధికారులు లేరు. దాంతో జలసంరక్షణ పనులనకు నీరసం వచ్చింది. జిల్లాలో అధికార పార్టీ నేతల నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రతిపాదనలు అందాయి. సాంకేతిక నిపుణులు కూడా అడిగిందే తడువుగా అనుమతులిచ్చేశారు. రూ.10 లక్షల లోపున్న వాటికి జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సు మేరకు నామినేషన్‌ పద్ధతిపై ఇచ్చారు. రూ.10 లక్షలు దాటితే టెండర్లు ఆహ్వానించి చేయించాలని నిర్ణయించారు. చాలాచోట్ల పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ టెండరు ప్రక్రియను నిర్వహించలేదు. ఈ కారణంగా కొన్ని గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడన్నట్లు కథ నడుస్తుంది. చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు, వంకల్లో పూడికతీత పనులను కొంత వేగవంతంగా చేపట్టారు. జల ప్రవాహానికి అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను, రాళ్లు రప్పలను తొలగించారు. తక్కువ పెట్టుబడి కావడంతో చకచకా చేపట్టారు. 2,708 పనులు చేయాల్సి ఉంటే 2,070 మొదలుపెట్టారు. అందులో 1,545 పూర్తి చేశారు. 525 వివిధ దశలో ఉన్నాయి. 355.61 క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాలి. 228.91 క్యూబిక్‌ మీటర్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రూ.245.96 కోట్లకు 175.80 కోట్లు విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి ఆరు నెలలుగా బిల్లులు చెల్లింపు లేకపోవడంతో కాంట్రాక్టర్లు మిగిలినవి చేసేందుకు ముందుకు రావడం లేదు. నింగి నుంచి నేలపైకి రాలే ప్రతి బొట్టునూ భద్రంగా ఒడిసి పట్టాలి. పరిగెత్తే నీటికి నడకలు నేర్పాలి. నడిచే నీటిని నిల్వ చేయాలి. నిలిచిన నీటిని భూమిలోకి ఇంకించాలని లక్ష్యంతో చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం జలస్ఫూర్తితో ముందుకొచ్చింది. గతేడాది 1,782 నిర్మించాలని అనుమతిచ్చారు. 1,070 చేపట్టారు. అందులో 547 మాత్రమే పూర్తిచేయడం గగనమైంది. 5,23 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా 712 (39.95 శాతం) చేపట్టలేదు. 3.49 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉండగా 1.54 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేరకే చేశారు. రూ.174.35 కోట్లకు రూ.76.76 కోట్లు విలువ చేసే నిర్మాణాలు జరిగాయి. ఆయా గ్రామాల్లో వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకే పంచాయతీలో రెండు మూడు గ్రూపులు ఉంటున్నాయి. పని ఎవరికి అప్పజెప్పాలన్న అంశంపై కీలక నేతల నడుమ సఖ్యత లేదు. ఈ కారణంగా కొంత జాప్యం జరిగింది. జిల్లాలో పూడికతీత, చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించి రూ.170 కోట్లు బకాయిలున్నాయి. పనిచేసినా ఆరు ఏడు నెలలుగా డబ్బులు చేతికందక పోవడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి, చోటామోటా నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పనులు చేయమని ఇంజినీరింగ్‌ అధికారులు అడుగుతున్నా కొందరైతే ససేమిరా అంటున్నారు. రూ.10 లక్షలకు పైగా వెచ్చించాల్సిన పనులకు టెండర్లు పిలవడంలో తాత్సారం చేశారు. నీరు-చెట్టు ప్రగతి పడకేసింది.

Related Posts