తిరుపతి నగరంలో నిర్మాణంలో వున్న గరుడవారధి కొంతమేర కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం కలగలేదు. ప్రాణనష్టం వాటిల్లక పోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తిరుపతి కపిలతీర్థం నుండి తిరుచానూరు మార్కెట్ యార్డు వరకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గరుడ వారధి నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద 40 మీటర్ల మేర వంతెన కుప్పకూలింది. కాగా వంతెన లో కొంత భాగాన్ని యంత్రాల సాయంతో పైకి చేరవేస్తూ వుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మునుముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా పనులు చేపట్టిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా నాసిరకం పనులు అలాగే సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందు వల్లే ఫ్లైఓవర్ కూలిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు జనసేన నాయకులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు