YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గడ్డికూడ దొరకని పరిస్థితి...!!

గడ్డికూడ దొరకని పరిస్థితి...!!
వరిగడ్డి దొరకక పశుపోషణ కష్టమవుతోంది. ఎండుగడ్డికి గడ్డు రోజులు వచ్చాయి. నీటిఎద్దడి ఉండటంతో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో పశుగ్రాసం కొరత తీవ్రమవుతోంది. వర్షాల లేమి, విద్యుత్‌ సమస్యలు, వాణిజ్య పంటలపై మక్కువతో రైతులు వరిపై దృష్టిసారించడం లేదు. మండలంలో వ్యవసాయధారిత కుటుంబాలు ఓ మోస్తరుగా ఉన్నా పాడి పరిశ్రమ బాగానే కొనసాగుతోంది. మండలంలో సుమారు పదివేల పశువులు ఉన్నాయి. పాడికి సరిపడ పశుగ్రాసం దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పశువులకు మేత తగినంత లేకపోవడంతో మండలానికి చెందిన పాడి రైతులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి తోడు దాణా ఖర్చు ఆకాశాన్నంటుతోంది. 50 కిలోల తౌడుకు సుమారు రూ. వెయ్యి, బస్తా పిండి ధర రూ.800, 50 కిలోల జొన్నల ధర రూ.900 ఉండటంతో రైతులకు పశు పోషణపై ఆసక్తి సన్నగిలుతొంది. ట్రాక్టరు ఎండుగడ్డి రూ. ఏడు వేల నుంచి రూ. తొమ్మిది వేల వరకు పలుకుతోంది. అప్పులు చేసి మరీ పాడి రైతులు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. వాగుల దగ్గర, ఊరికి పొలిమేరల్లో, చెరువు వెనుకాల, బోరు బావులున్న రైతులు పచ్చగడ్డి సాగు చేస్తున్నారు. పాడిరైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పాడి రైతులు అప్పులు చేసి పచ్చగడ్డిని కోనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పచ్చగడ్డి, ఎండుగడ్డి వ్యాపారులు ధరలను అమాంతం పెంచుతున్నారు. ఈ పరిస్థితులు సామాన్య రైతులకు భారమవుతున్నాయి. పలు సమస్యల కారణంగా వరి పండించే అవకాశం తక్కువగా ఉండటంతో భవిష్యత్తులో గడ్డి ధరలు మరింత పెరిగే అవకాశముందని అన్నదాలు వాపోతున్నారు. గడ్డి, నీటి కొరతతో చాలా చోట్ల పశువులను అమ్మేసుకుంటున్నారు. మండలంలోని మోరంపల్లిబంజర సంతకు వారానికి దాదాపుగా వెయ్యికి పైగా పశువులు అమ్మకాని వస్తున్నాయి. పని చేసే ఎడ్లను కూడా విక్రయించక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. సంతతో పాటు కబేళాలకు కూడా మూగజీవాలు తరలుతున్నాయి.

Related Posts