ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దూకుడు పెంచింది. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు.
మొదటి విడత ఎన్నికలకు సోమవారం నుంచే నామినేషన్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఉద్యోగులకు హడావుడిఏర్పడింది. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని.. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నాలుగో విడతకు రీషెడ్యూల్ చేశారు.రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలు యథావిధిగా ముందుగా ప్రకటించిన విధంగా జరుగుతాయి.అంటే, గతంలో రెండో ఫేజ్‌లో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు మొదటి దశలోనూ, 3, 4 దశల్లో జరగాల్సిన ఎన్నికలు రెండు, మూడు దశల్లో జరుగుతాయి. ఈ రోజు (సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన మొదటి దశ షెడ్యూల్ మాత్రం నాలుగో దశకు మారింది.గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా దానిలో మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. అంటే, తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్‌రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేస్తూ ఎన్నికల నిర్వహణకు అనుమతించింది.
జగన్ కీలక భేటీ పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్య నేతలు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌తో సీఎం సమీక్షించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై సీఎం చర్చించినట్లు సమాచారం. ఎస్‌ఈసీకి సహకరించే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.