YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బడి గొంతెండుతోంది...!!

బడి గొంతెండుతోంది...!!
జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటి తంటాలు నెలకొన్నాయి.. అడుగంటుతున్న భూగర్భ జలాలకు తోడు ప్రత్యేకంగా తాగునీటి సరఫరా సదుపాయాలు లేని కారణంగా విద్యార్థులకు దాహార్తి తప్పడం లేదు. నల్లాలు, నీటి ట్యాంకుల ద్వారా అందజేస్తున్న నీరు తాగేందుకు అనువుగా ఉండటం లేదు. మినరల్ వాటర్ అందించేందుకు ప్రభుత్వం, దాతలు పలు పాఠశాలలకు సమకూర్చిన ఆర్వో పరికరాల నిర్వహణ కొరవడి, నిర్లక్ష్యం అలుముకొని నిరుపయోగంగా దర్శనిమస్తున్నాయి. మండుతున్న ఎండలు, ఉక్కపోతల మధ్య ఓ వైపు ఒంటిపూట బడుల్లో తాగునీరు విద్యార్థులు అల్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగేందుకే కాదు మధ్యాహ్న భోజనం వంటకూ సురక్షితమైన నీరు లేదని ఉపాధ్యాయులే చెబుతున్నారు. కనీసం ఈ వేసవి సెలవుల్లోనైనా.. పాఠశాలల్లో తాగునీటి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో 66 ప్రభుత్వ పాఠశాలల్లో 7062, స్థానిక సంస్థల పరిధిలోని 595 బడుల్లో 33,956, 12 కేజీబీవీల్లో 1,494 మంది విద్యార్థులు చదువుతున్నారు. సర్కారు బడుల్లో ఏడాది పొడవునా తాగునీటికి పలు విధాలుగా విద్యార్థులు కష్టాలే ఎదుర్కొంటున్నారనడానికి మధ్యాహ్న భోజనం వేళ విద్యార్థులు పట్టుకొస్తున్న నీళ్ల సీసాలే నిదర్శనమని చెప్పవచ్చు.. ఎప్పుడో జిల్లాలోని అతి తక్కువ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన జలమణి ప్లాంటుల నిర్వహణ కొరవడి మూలనపడ్డాయి. తాగునీరు, ఇతర అవసరాలకు వాడే నీటి కోసం కరీంనగర్‌లోనే గాకుండా గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ చేతిపంపులు, కొళాయిలపైనే ఆధారపడుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో బోర్‌వేల్‌ ద్వారా వచ్చే నీటిని వాడుతున్నారు. సురక్షిత తాగునీరు లేని కారణంగా మెజారిటీ పాఠశాలల్లో విద్యార్థులు అన్ని కాలాల్లో ఇంటి నుంచే నీళ్ల సీసాల్లో తెచ్చుకుంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి వసతికి జిల్లా సర్వశిక్ష అభియాన్‌ సైట్‌ ఇంజినీర్లు మండలాలు, నియోజకవర్గాల వారీగా వివరాలను సేకరించి తయారు చేస్తున్న ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. రెండేళ్లుగా ప్రతిపాదనలు తయారు చేస్తూ అంచనా వ్యయాన్ని లెక్కిస్తున్నా సదుపాయాలను కల్పించే పనులకు మాత్రం నిధుల కొరతతో మోక్షం లభించడం లేదన్న ఆరోపణలున్నాయి. గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 76 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 76 ఉన్నత పాఠశాలల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచిస్తూ వాటి ఏర్పాటుకు రూ.2.35 కోట్ల వ్యయం అవసరమని ప్రతిపాదనలను తయారు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 31 పాఠశాలల్లో చేతిపంపులను వేయించేందుకు రూ.46.50 లక్షలు, మరో 114 పాఠశాలల్లో తాగునీరు, ఇతర నీటి అవసరాలకు పంప్‌సెట్‌లు, ట్యాంక్‌ల కొనుగోలుకు రూ.74.10 లక్షలు అవసరమని ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలను రెండు నెలల కిందటే తయారు చేశారు. కానీ, ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు శుద్ధజలంతో దాహార్తిని తీర్చే పాఠశాలలు కొన్ని ఉన్నా.. చాలా వాటిల్లో తాగడానికి, చేతులు శుభ్రం, మధ్యాహ్న భోజనం వంటకు ట్యాంకుల్లో నిల్వ చేసిన నీటినే వినియోగిస్తున్నారు. కరీంనగర్‌ మండలం పద్మనగర్‌, సైదాపూర్‌, కరీంనగర్‌ మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఫ్లోరైడ్‌ నీరు ఉండటంతో తాగేందుకు ఆ నీరు పనికిరాదని సంబంధిత అధికారులు ఇదివరకే తేల్చి చెప్పారు. శుద్ధజలం లేదా పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు వాటిల్లో ప్రత్యామ్నాయ చర్యలు కరవవుతున్నాయి. ఇక బడుల్లో నీటిని నిల్వ చేస్తున్న ట్యాంకులను శుభ్రం చేయడమనేది అరుదే అని చెప్పవచ్చు. మండలస్థాయిలోని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి పాఠశాలల్లో దాహార్తిని దూరం చేయాల్సి ఉంది.

Related Posts