స్వాతంత్ర్య సమరయోధులందించిన స్ఫూర్తితో దేశాభివృద్ధికి యువత పునరంకితం కావాలని శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం శాసనమండలి ప్రాంగణంలో ఆయన మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం భారత దేశానికి కూడా రాజ్యాంగం ఉండాలని ఉద్దేశంతో ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమకారులు నిర్ణయించారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఏ దేశానికి లేనంత బలం భారతదేశానికి యువత రూపంలో లభించిందన్నారు. దేశ జనాభాలో యువత 34 నుంచి 35 శాతం మేర ఉందన్నారు. దేశ పునర్మిణానికి యువత అంకితమవ్వాలని చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు అందించిన స్వేచ్ఛా ఫలాలు అనుభవిస్తూ...దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. దేశం తమకేమి ఇచ్చిందనేది కాకుండా దేశానికి ఏం చేశామని యువత భావించాలన్నారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశం తలెత్తుకునేలా దేశాభివృద్ధికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అసెంబ్లీ భద్రతా సిబ్బంది అందజేసిన గౌరవ వందనాన్ని చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు.