జగన్ పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్ని కష్టాలు ఎదురయినా జగన్ తన కున్న టార్గెట్ ను రీచ్ అయ్యారు. ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లను జగన్ ఎదుర్కొన్నారు. కానీ దేనికీ భయపడలేదు. వెనకడుగు వేయలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ తన చుట్టూ ఉన్న కోటరీ మీదనే ఆధారపడుతుండటం, ఆయన వద్ద ఉన్న న్యాయ సలహాదారులు సయితం సరైన గైడెన్స్ ఇవ్వకపోవడంతోనే జగన్ విఫలమవుతున్నారన్న కామెంట్స్ సర్వత్రా వినపడుతున్నాయి.తొలి నుంచి జగన్ ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి చిక్కులే ఎదురవుతున్నాయి. కొన్నికేసుల్లో మొట్టికాయలు పడ్డాయి. మరికొన్ని కేసుల్లో ప్రభుత్వంపై అంక్షితలు పడ్డాయి. అయినా జగన్ న్యాయసలహాదారులు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. దాదాపు 70 కేసుల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులొచ్చాయి. అయినా మార్పులేదు. చివరకు పంచాయతీ ఎన్నికలపై మొన్న సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ సయితం ఒకరోజు ఆలస్యమవడానికి పిటీషన్ లో లోపాలేనన్న చర్చ జరుగుతుంది.ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ జగన్ తెగేదాకా లాగారు. ఇది వాస్తవం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించడం, కనగరాజ్ ను నియమించడం, మళ్లీ న్యాయస్థానం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులు కావడం వంటివి ఆగ్రహావేశాలతో తీసుకున్న నిర్ణయాలు జగన్ ను దెబ్బతీశాయని చెప్పక తప్పదు. రాజ్యాంగ వ్యవస్థ లతో గేమ్స్ వద్దు అన్న సంకేతాలను పంపింది.నిజమే 151 సీట్లతో ప్రజాభిప్రాయంతో గెలిచిన జగన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అనేక వ్యవస్థల ద్వారా విపక్షమే అడ్డుకుంటుందన్నది వాస్తవమే అయినా సహనం వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్థంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తాజాతీర్పుతో నీరుగారి పోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సేఫ్ ఎగ్జిట్ కావడమే అన్ని విధాలుగా మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. అడ్వొకేట్ జనరల్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటలుగా సాగుతుంది. సుప్రీంతీర్పు పై ఏం చేయాలన్న దానిపై జగన్ ఇంకా చర్చిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రజారోగ్యం కోసమే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని కోరామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఎవరిపైనో పైచేయి సాధించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని కోరిందని ఆయన తెలిపారు. ఎస్ఈసీ నిర్ణయించినట్లుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశంలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలని నిర్ణయించారు.