ఈ మారు రబీ సాగు బాగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్ ఒకటి నుంచి రబీ సీజన్ మొదలవుతుండగా మూడున్నర మాసాలు గడిచాక కూడా సాగు అంతగా ఆశాజనకంగా లేదు. జనవరి నాల్గవ వారం వచ్చాక చూస్తే గడచిన మూడేళ్ల కంటే ఈ తడవ అతి తక్కువ సాగు నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడే కనిష్ట సాగు నమోదవుతుందేమోనని ప్రభుత్వ, వ్యవసాయ, అర్థగణాంక విభాగాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గినపక్షంలో ఆ వారా దిగుబడులూ తగ్గుతాయంటున్నాయి. ఇప్పటికి సాగు కావాల్సినదానిలో ఐదున్నర లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఆహార పంటల లోటు 4.21 లక్షల ఎకరాలు (10 శాతం).ఈ సారి రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ చివరిలో, రబీ ఆరంభంలో అధికంగా వర్షాలు కురిశాయి. మొత్తమ్మీద ఎపిలో సగటున 26.5 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో 26.8 శాతం, రబీలో 25.1 శాతం, శీతాకాలంలో 58 శాతం ఎక్కువ వర్షం కురిసింది. కాగా ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూరల్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల తీవ్ర వర్షాభావం నెలకొంది. అధిక వర్షాల వలన నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల వంటి ప్రధాన ప్రాజెక్టులతో పాటు చిన్న, మధ్యతరహా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు తదితర నీటి వనరులు బాగానే ఉన్నాయి. ఆ ఆలోచనతోనే ప్రభుత్వం రబీ సాగు లక్ష్యాన్ని సాధారణం కంటే కొంత పెంచింది. మామూలు సాగు 56.19 లక్షల ఎకరాలు కాగా సుమారు 59 లక్షల ఎకరాలకు టార్గెట్‌ను పెంచింది. జనవరి 20 నాటికి నార్మల్‌గా 49 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా 43.59 లక్షల ఎకరాల్లో వేశారు. తగ్గుదల సుమారు ఐదున్నర లక్షల ఎకరాలు (11 శాతం). ఇదే సమయానికి ముందటేడు 46.99 లక్షల ఎకరాల్లో, నిరుడు 48.66 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు.ఆహార ధాన్యాలు ఇప్పటికి 43.95 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా 39.74 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. తగ్గుదల 4.21 లక్షల ఎకరాలు (10 శాతం). ఇదే సమయానికి ముందటేడు 42.42 లక్షల ఎకరాల్లో, నిరుడు 43.66 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రబీలో అపరాలు, వాణిజ్య పంటల సాగుకు సమయం ముగిసింది. అడపాదడపా జనవరి నెలాఖరు వరకు ఆ పంటలను రైతులు వేస్తారు. ఈ వేళకి జన్న, మొక్కజన్న, తృణధాన్యాలు, శనగ, మినుము, పెసర సాగు పూర్తయిపోవాలి. కానీ వాటి సాగు తగ్గింది. నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే వరి సాగవుతుంది. వరి నాట్లు ఇప్పటికైతే ఆశాజనకంగా ఉన్నాయి. వరి పంట అయినా సాధారణ సాగు నమోదు చేస్తుందో లేదోనని సర్కారు ఉత్కంఠగా ఉంది.
సంవత్సరం సాగు లక్షల ఎకరాలు
2016 50.80
2017 43.10
2018 53.12
2019 46.49
2020 48.66
2021 43.59